కేటీఆర్ మెడకి చుట్టుకున్న మేడిగడ్డ సందర్శన
x

కేటీఆర్ మెడకి చుట్టుకున్న మేడిగడ్డ సందర్శన

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.


బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అనుమతి లేకుండా చేసిన డ్రోన్ ఫ్లైయింగ్ కేసులో ఆయనపై కేసు నమోదైంది. అంబట్‌ పల్లి గ్రామంలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ వద్ద అనుమతి లేకుండా డ్రోన్‌ను ఎగురవేశారనే ఆరోపణలపై కేటీఆర్ తోపాటు ఇతర నేతలపై తెలంగాణ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

జూలై 26న మధ్యాహ్నం 12:30 నుంచి 2:00 గంటల మధ్య జరిగిన ఈ ఘటనపై జూలై 29న మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వలి షేక్ ఫిర్యాదు చేయగా.. ఈరోజు ఎఫ్‌ఐఆర్‌ కు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌తో సహా తన పలువురు నేతలు కలిసి బ్యారేజీని సందర్శించి అవసరమైన అనుమతులు తీసుకోకుండా డ్రోన్ కెమెరాను ఆపరేట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ తెలంగాణ ప్రభుత్వానికి కీలకమైన ప్రాజెక్టు అని, అనధికార డ్రోన్ కార్యకలాపాల వల్ల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వలి షేక్ ఫిర్యాదులో తెలిపారు. డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు కేసుపై దృష్టి సారించారు. ఫిర్యాదు మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ పోలీసులు కేటీఆర్‌, అతని సహచర బృందంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపం ఉందని ఆరోపిస్తున్నాయి. అందుకు ఉదాహరణ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే అని చెబుతున్నాయి. ఈ క్రమంలో జులై 26 న అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ ముగిసిన అనంతరం కేటీఆర్.. సహచర ఎమ్మెల్యేలు, పార్టీ ఇతర నేతలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లారు. అందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్లారు. వారి సందర్శన అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ దృఢంగా ఉందని, లక్ష క్యూసెక్కుల నీటి ఉధృతిని కూడా తట్టుకుని నిలబడిందని తెలిపారు. సాక్ష్యంగా, ఫోటోలు, వీడియోలు కూడా తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అయితే అక్కడ డ్రోన్ కెమెరాలను అనుమతి లేకుండా ఉపయోంచారని ప్రస్తుతం కేసు నమోదైంది.

Read More
Next Story