హైడ్రా వ్యతిరేక నిరసనకారులపై కేసు నమోదు
హైడ్రా కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిపై కేసులు నమోదయ్యాయి.
హైడ్రా కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిపై కేసులు నమోదయ్యాయి. సున్నం చెరువు వద్ద ఆత్మాహుతి యత్నం చేసిన వారిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 8న మాదాపూర్ సున్నం చెరువు వద్ద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆదేశించిన కూల్చివేత ఆపరేషన్‌ను అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నించినవిషయం తెలిసిందే. కూల్చివేతలు ఆపాలంటూ స్థానికులు కొంతమంది ఆందోళనకు దిగారు. అందులో భాగంగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని కూల్చివేతలు ఆపకపోతే నిప్పటించుకుంటామని అధికారులను బెదిరించారు.
ఈ ఘ్టనపై సికింద్రాబాద్ బుద్ధభవన్‌లోని నార్త్ ట్యాంకుల డివిజన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సున్నం చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) లో ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతను పర్యవేక్షిస్తున్న హైడ్రా టీమ్ సూచనలకు అనుగుణంగా తాను విధులు నిర్వర్తిస్తున్నానని, ఆ సమయంలో నిర్వాసితులు పని చేసుకోనివ్వకుండా తన విధులకు ఆటంకం కలిగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వోద్యోగి తన చట్టబద్ధమైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సిఆర్ నెం. 1193/2024, సెక్షన్ 132 రీడ్ విత్ బీఎన్ఎస్ 3(5) కింద కేసు నమోదు చేశారు.
కాగా, మాదాపూర్‌లోని సున్నం చెరువులోని సర్వే నంబర్ 12లో సెప్టెంబర్ 8న ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఎ.లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులు వెంకటేష్ (35), అతని భార్య లక్ష్మి (28), అతని సోదరుడు నరేష్ (28) గా గుర్తించారు. కూల్చివేత ప్రక్రియను ఆపే ప్రయత్నంలో తమ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు.