
చేవెళ్ళ ప్రమాదంపై కమిషన్ సీరియస్
రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన చేవెళ్ళ రోడ్డు ప్రమాదంపై మానవహక్కుల కమిషన్ మంగళవారం సూమోటోగా కేసు నమోదుచేసింది
చేవెళ్ళ రోడ్డు ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా స్పందించింది. రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన చేవెళ్ళ రోడ్డు ప్రమాదంపై మానవహక్కుల కమిషన్ మంగళవారం సూమోటోగా కేసు నమోదుచేసింది. సోమవారం తెల్లవారిజామున చేవెళ్ళ రోడ్డులోని మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆడకుండా చనిపోయారు. ప్రమాదంపై మీడియా ఛానళ్ళు, దినపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా కమిషన్ కేసు నమోదుచేసింది. రవాణా, రోడ్లు, భవనాల శాఖ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కమిషన్ నోటీసులు జారీచేసింది. డిసెంబర్ 15వ తేదీలోగా ప్రమాదంపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, నేషనల్ హైవేస్ అథారిటి ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసును కూడా నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఇప్పటికే బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు ఘటనా స్ధలానికి వెళ్ళి పరిశీలించారు.
తాండూరు నుండి హైదరాబాదుకు వస్తున్న బస్సును మీర్జాగూడ దగ్గర కంకర టిప్పర్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 34మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరినీ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిల్లో చేర్చి వైద్యం చేయిస్తున్నది ప్రభుత్వం. టిప్పర్ అతివేగంగా రావటంతో పాటు ఓవర్ లోడ్ కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇపుడు మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు నేపధ్యంలోనే పోలీసులు ఎలాంటి నివేదికను సమర్పిస్తారో చూడాలి.

