కాళేశ్వరంపై సీబీఐ విచారణేనా?  కోర్టుకు ఇచ్చిన సీబీఐ కౌంటర్ లో ఏముందీ..
x
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆనాటి గవర్నర్ నరసింహన్

కాళేశ్వరంపై సీబీఐ విచారణేనా? కోర్టుకు ఇచ్చిన సీబీఐ కౌంటర్ లో ఏముందీ..

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిని బయటపెడితే బీఆర్ఎస్ ను కట్టడి చేయడం చాలా సులభమన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందా?


తెలంగాణ రాజకీయమంతా ఇకపై కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తిరిగేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెడితే బీఆర్ఎస్ ను కట్టడి చేయడం చాలా సులభమన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. సరిగ్గా ఈ దశలోనే సీబీఐ కూడా ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్, న్యాయవాది రామ్మోహన్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ వేసిన కౌంటర్ ఫైల్ ఈ అనుమానానికి మరింత తావిస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇస్తే కాలయాపన జరుగుతుందనే వాదన ఉన్నా కోర్టు ఆదేశిస్తే ఏమి చేయాలన్న సంకటస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కేసును విచారించేందుకు సీబీఐ సంసిద్ధత...


కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని CBI స్పష్టం చేసింది. హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు ప్రారంభిస్తామని సీబీఐ అధికారులు హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు మాత్రం ప్రభుత్వమే కల్పించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని న్యాయవాది రామ్మోహన్‌రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌కి సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.

బ్యారేజీకి పగుళ్లు ఎలా వచ్చాయి?

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మహాలక్ష్మి బ్యారేజీకి సంబంధించిన ఏడెనిమిది పిల్లర్లు కుంగి పైనున్న వంతెన బీటలు వారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతి తీసుకుని బిట్లు బిట్లుగా వేర్వేరు కాంట్రాక్ట్ కంపెనీలకు అప్పగించింది. కాంక్రీటు మిక్సింగ్, ఇతర నిర్మాణ సామాగ్రిలో లోపం, డిజైన్ లో లోపాల వల్ల ఈ పిల్లర్లు కుంగాయన్న ఆరోపణలు ఊపందుకున్నారు. భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి.

అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులో నమోదైన పిటిషన్‌పై సీబీఐ క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు ఆదేశిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని హైకోర్టుకు తెలిపింది.

సీబీఐకీ పరిమితులున్నాయా?

సీబీఐ హైదరాబాద్‌ విభాగం హెడ్‌ కల్యాణ్‌ చక్రవర్తి కౌంటర్‌ దాఖలు చేశారు. కాళేశ్వరంపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. విచారణ కోసం తమకు అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలతోపాటు సిబ్బంది కావాలని హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్టియం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అంశంపై సీబీఐకి పరిమితులున్నాయని తెలిపింది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులపై స్పందించలేదని సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారు. పిటిషనర్‌ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటని తేలాల్సి ఉందన్నారు. కేవలం రాష్ట్ర ఉద్యోగులే ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని కోర్టుకు తెలిపారు. సీబీఐ కౌంటర్‌ను పరిశీలించిన హైకోర్టు ఫిబ్రవరి 2న మరోసారి విచారణ జరుపుతామని విచారణను వాయిదా వేసింది.

విజిలెన్స్ సోదాలు...

ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని నీటిపారుదలశాఖ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడంతో ఈ చర్యలు చేపట్టారు. జలసౌధలోని తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యాలయంలోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే ఇప్పడు ఈ ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలిపింది.

Read More
Next Story