తెలంగాణ పంట ఉత్పత్తులకు కేంద్ర పరిశ్రమల శాఖ గుర్తింపు
x

తెలంగాణ పంట ఉత్పత్తులకు కేంద్ర పరిశ్రమల శాఖ గుర్తింపు

తెలంగాణలోని వివిధ పంటల ఉత్పత్తులకు ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ కింద కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ గుర్తించింది.


తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, వివిధ రకాల పంటలు , ఉత్పత్తులను గుర్తించింది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల్లో తెలంగాణలోని జిల్లాలు ముందున్నాయి. దేశంలోని 35 రాష్ట్రాలు, 713 జిల్లాల్లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ను కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆమోదించింది. 137 ప్రత్యేక ఉత్పత్తులున్నాయి.


ఏ జిల్లాలో ఏ పంట ఉత్పత్తి అంటే...
కామారెడ్డి,ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోయాబీన్ సంబంధిత ఉత్పత్తులను, భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్, ఖమ్మం, ములుగు,వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మేలిరకమైన మిర్చి పంటను ప్రోత్సహించాలని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ గుర్తించింది.మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో మామిడిసండ్లు, నారాయణపేట్ , జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలో వేరుశనగ ఉత్పత్తులు, కామారెడ్డిలో సోయాబీన్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వరి ధాన్యం,జనగామలో వరి సంబంధిత ఉత్పత్తి అయిన చిట్టిముత్యాలు రకం బియ్యం,మహబూబ్ నగర్, కొమురం భీం జిల్లాలో పప్పుధాన్యాలు, నల్గోండలో స్వీట్ ఆరంజ్, నిజామాబాద్ జిల్లాల్లో పసుపు,రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపల అనుబంధ ఉత్పత్తులు,రంగారెడ్డి, సిద్ధిపేట్ జిల్లాల్లో టమోట, వంకాయ, పచ్చిమిర్చి, బీన్స్, స్వీట్ పొటాటో కూరగాయలు, యాదాద్రి భువనగిరి,సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో పాల ఉత్పత్తులను కేంద్రం గుర్తించింది.హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి,వరంగల్ అర్బన్, మెదక్ జిల్లాల్లో రెడీ టు ఈట్ స్నాక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రిత్వశాఖ నిర్ణయించింది.

నల్గొండలో తీపి నారింజకు గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వ సిఫార్సుల ఆధారంగా తెలంగాణలోని నల్గొండ జిల్లాకు తీపి నారింజలను ఒక జిల్లా ఒక ఉత్పత్తిగా గుర్తించినట్లు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.సాగులో అనుకూలత, అధిక ఉత్పాదకత,నల్గొండ ప్రాంతంలో నారింజ సాగు ప్రాబల్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నల్గొండకు తీపి నారింజను ఒక జిల్లా ఒక ఉత్పత్తిగా ఎంపిక చేసింది.

నల్గొండ ఎంపీ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం
లోక్‌సభలో నల్గొండకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ ఈ విషయాన్ని తెలిపారు.ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకు డిమాండ్ ఆధారిత పరిశోధన, అభివృద్ధి పనులను చేపట్టడానికి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం అందిస్తోందని కేంద్రమంత్రి చెప్పారు.

తీపి నారింజ ఉత్పత్తి పెంచుతాం
ఉత్పత్తి ప్రక్రియ అభివృద్ధి, సమర్థవంతమైన సాంకేతికత, మెరుగైన ప్యాకేజింగ్, విలువ జోడింపు ఇందులో భాగమని మంత్రి పాశ్వాన్ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం, మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, తంజావూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ పరిశోధనా సంస్థల నుంచి తీపి నారింజ రసాన్ని వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చడానికి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర మంత్రి చెప్పారు.


Read More
Next Story