భేటీకి సిద్ధమవుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు..!
x

భేటీకి సిద్ధమవుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు..!

భేటీ హాజరవడం వీలవుతుందా లేదా అనేది తెలపాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోరింది.


రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు ముదురుతోంది. బనకచర్ల విషయంలో ఇది మరింత తీవ్రతరం అవుతోంది. ఇరు రాష్ట్రాల అధికార పార్టీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. జల వివాదంపై భేటీకి సిద్ధమవుతున్నారు. ఈ భేటీ కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జులై 16న జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదానికి శుభం కార్డు పడాలంటే ముఖ్యమంత్రుల భేటీ అనివార్యమని కేంద్రం భావించింది. ఈ మేరకు వారిని భేటీ కావాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడిని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భేటీకి ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్రం సర్క్యులర్ ఒకటి విడుదల చేసింది. భేటీ హాజరవడం వీలవుతుందా లేదా అనేది తెలపాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోరింది.

అయితే కృష్ణా, గోదావరి జలాల వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీ లాగేసుకుంటుందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. ఇదే అంశంపై ప్రభుత్వం స్పందించి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ విషయంలో తాము కూడా కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి రెడీ అయింది. కృష్ణాపై రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లకు క్లియరెన్స్, నీటి కేటాయింపులు, ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం వంటి అంశాలను కేంద్రాన్ని కోరాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

మరోవైపు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సిద్ధమవుతున్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ పర్యటించనున్నారు. కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. ఇదే మంచి అవకాశం భావించిన కేంద్రం.. ఇద్దరు ముఖ్యమంత్రులను భేటీ కావాలని, జల వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టించాలని భావిస్తోంది. మరి ఈ బేటీ జరుగుతుందో లేదా? జరిగితే ఎలాంటి పరిష్కారాలను రాబడుతుంది? అనేది చూడాలి.

Read More
Next Story