తెలంగాణ పత్తి రైతులకు కేంద్రం ద్రోహం
x
Images courtesy of Dinesh Khanna for Laudes Foundation

తెలంగాణ పత్తి రైతులకు కేంద్రం ద్రోహం

దిగుమతి సుంకం ఎత్తేయడం పత్తి రైతులను సంక్షోభంలోకి నెట్టే చర్య


-జి. రాం మోహన్

అధికారం లోకి వస్తే డాక్టర్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామని తద్వారా రైతుల ఆదాయం పెంచుతామని వాగ్దానం చేసి పత్తి పైన సుంకం ఎత్తివేయడం ద్వారా ఆ హామీ ని తుంగ లో తొక్కారని తెలంగాణ సీడ్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్, అన్వేష్ రెడ్డి సుంకెట‌ కేంద్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించారు.

అన్వేష్ రెడ్డి సుంకెట

తద్వారా రైతుల ఆదాయం రెండింతలు చేయకపోగా ఈ చర్య ద్వారా వారిని మరింత సంక్షోభం లోకి కేంద్రం నెడుతోంది వాళ్ళు మరింత ఎక్కువ గా ఆత్మహత్యలు చేసుకుంటారు అని ఆయన అన్నారు.

కేంద్రం ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 30 మద్యన పత్తి పైన దిగుమతి సుంకాల‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పైన స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. “ఈ నిర్ణయం వలన పత్తి వ్యాపారస్తులు తక్కువ ధరకు పత్తిని దిగుమతి చేసుకుని నిల్వ చేసుకుంటారు. మన రాష్ట్రం లో అక్టోబర్ నెలలో పత్తి మార్కెట్ కు వస్తుంది అప్పుడు వ్యాపారస్తులు సిండికేట్ గా మారి రైతుల కష్టాన్ని దోచుకుంటారు. దీనితో దేశ వ్యాప్తంగా గాను మన రాష్త్రం లోని ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారు. వారి ఆత్మహత్యలు పెరిగే అవకాశం వుంది. యిప్పటికే పెరుగుతున్నాయి కూడా. ఈ నిర్ణయం వారిని మరింత సంక్షోభం లోకి నెడుతుంది. ఈ ప్రతిపాదన జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఉపకరిస్తుంది,” అని అన్నారు.

కాగా యిదే ప్రకటన లో పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ సంవత్సరం పత్తి క్వింటాల్ కు డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు(C2+50%) ప్రకారం Rs 10,075 మద్దతు ధర ప్రకటించాలి అని అయన డిమాండ్ చేసారు.

మన దేశం లో పత్తి సాగు విస్తీర్ణం సుమారు 120.55 లక్షల హెక్టార్లు. యిది ప్రపంచం లో 36 శాతం గా వుంటుంది. సాగు భూభాగంలో భారత్ మొదటి స్థానం లో వుండగా దేశం లో మన రాష్ట్రం మహారాష్ట్ర, గుజరాత్ ల తరువాత మూడవ స్థానం లో వుంటుంది. యిప్పటికే ప్రభుత్వ పరంగా పత్తి కొనుగోళ్లు తగ్గించి ప్రైవేట్ వారికి అప్పగించారు. మన రాష్ట్రం లో 40 లక్షల ఎకరాలలో ఈ పంట పండిస్తారు. సుంకాల ఎత్తివేత మన పత్తి రైతుల పైన తీవ్రంగా వుంటుంది. కేంద్రం సుంకాల పైన తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాను అని ఆయన అన్నారు.

ఈ విషయం పైన స్పందిస్తూ అఖిల భారత కిసాన్ సంఘ నాయకులు సారంపల్లి మల్లా రెడ్డి గారు, “రైతుల ఆత్మహత్యలు జరగటానికి గల అనేక కారణాలలో నకిలీ విత్తనాలు, పర్యావరణ విపత్తులు, అప్పు పుట్టక పోవటం లేదా అధిక వడ్డీలు, మద్దతు ధర దొరకక పోవటం తో పాటు మన దేశం చేసే ఎగుమతి దిగుమతి నిర్ణయాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నిర్ణయం కచ్చితంగా వెనక్కి తీసుకోవాలి,” అన్నారు.

ఈ తగ్గింపు అమెరికా వత్తిడికి లొంగి తీసుకున్నదే అని అంటారు రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి. “మన దేశం పాలు, పత్తి, పౌల్ట్రీ దిగుమతి చేసుకోవాలని వత్తిడి చేస్తోంది ట్రంప్ నేతృత్వం లోని అమెరికా ప్రభుత్వం. మన దేశం CACP (పంటల ధరలు నిర్ణయించే సంస్థ) రిపోర్ట్ ప్రకారం మన అవసరాల కంటే 30 లక్ష టన్నుల పత్తిని అధికంగా పండిస్తోంది. ఇప్పటికే వస్తున్న అకాల వర్షాల వలన పత్తి రైతులు నష్టపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2019 వరకు వుండిన పర్యావరణ ఆధారిత భీమ పథకం కూడా యిప్పుడు లేదు. ఒక వైపు పంట నష్టం మరో వైపు ధరలు పడిపోతే మన రైతులు ఎలా మనగలుగుతారు. పత్తి రేటు పెరిగితే పరిశ్రమల కోసం దిగుమతి సుంకాలు తగ్గించి వాళ్ళకు మేలు చేయటానికి నిర్ణయాలు తీసుకుంటారు కానీ రైతుల కోసం స్పందించరు. ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ ల కోసమే పనిచేస్తున్నాయి,” అని అయన అన్నారు.

పామ్ ఆయిల్ విషయం లోను సుంకాలు తగ్గించటం తో ఒక టన్నుపచ్చి గెలలు Rs 23,000 నుండి Rs 18,000 కు పడిపోయాయి. మొక్కజొన్న లను ఇథనాల్ పరిశ్రమ ప్రయోజనాల కోసం వాటిపైన వున్న సుంకాలను 50 నుండి 15 శాతానికి తగ్గించి తక్కువ ధరకు దిగుమతి చేసుకోవటానికి అనుమతి యిచ్చారు. యిక్కడ మార్కెట్ లో ఎక్కువ ధర పెట్టి కొనాల్సిన అవసరం రాకుండా ఇలా చేసారు, యిది రైతాంగ వ్యతిరేక చర్య కాక మరలేమిటి అని అయన వాపోయారు.

Read More
Next Story