జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పార్టీలతో సీఈఓ భేటీ
x

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పార్టీలతో సీఈఓ భేటీ


జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిసిస్తోంది. ప్రతి పార్టీ కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందులో గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల నగారా కూడా మోగింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీలకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల కోడ్‌ను తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. అంతేకాకుండా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీసుకొచ్చిన కొత్త ఎన్నికల సంస్కరణలను అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఆ సంస్కరణలు ఏంటి అనే అంశాన్ని పార్టీలకు వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆప్, ఎంఐఎం, తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ కొత్త ఎన్నికల సంస్కరణలు తొలిసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో అమల్లోకి రానున్నట్లు వివరించారు. ఓటర్ల సౌకర్యం, పారదర్శకత, ఎన్నికల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేసినట్లు చెప్పారు.

చేసిన సంస్కరణలు ఇవే..

• ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు.

• ఓటర్లు తమ అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు ఈవీఎంలపై రంగు ఫోటోలు ఉంచడం.

• మహిళా ఓటర్ల పాల్గొనడం పెంచేందుకు మహిళా సిబ్బందిని అదనంగా నియమించడం.

• వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం సౌకర్యాలు — వీల్‌చెయిర్లు, ర్యాంపులు, పిక్-అప్/డ్రాప్‌ సదుపాయాలు.

• రియల్‌టైమ్‌ ఓటింగ్‌ టర్నౌట్‌ మానిటరింగ్‌ కోసం డిజిటల్‌ డ్యాష్‌బోర్డులు, మొబైల్‌ యాప్‌లు.

• సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత పర్యవేక్షణ, జీపీఎస్‌ ట్రాకింగ్‌.

• మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) ఉల్లంఘనలపై కఠిన చర్యలు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ.

• పర్యావరణహిత ఎన్నికలు — పేపర్‌ వినియోగం తగ్గించడం, డిజిటల్‌ సమాచార మార్పిడి ప్రోత్సాహం.

సీఈవో సుధర్షన్‌రెడ్డి ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలతో ఏర్పాట్లను మంగళవారం సమీక్షించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించి ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సహకరించాలని ఆయన సూచించారు.

Read More
Next Story