అప్పుడు ఆకాశమేహద్దుగా రెచ్చిపోయారు..త్వరలో నోటీసులు అందుకోబోతున్నారు
x
Kaleswaram project and Justice Ghosh

అప్పుడు ఆకాశమేహద్దుగా రెచ్చిపోయారు..త్వరలో నోటీసులు అందుకోబోతున్నారు

నార్త్ కొరియాలో ఏమి జరుగుతోందో బయటప్రపంచానికి తెలీనట్లే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కేసీయార్ ప్రభుత్వం అలాగే వ్యవహరించింది.


అధికారంలో ఉన్న పదేళ్ళు కారుపార్టీ నేతలు ఆకాశమేహద్దుగా రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మరీ విచిత్రంగా వ్యవహరించారు. నార్త్ కొరియాలో ఏమి జరుగుతోందో బయటప్రపంచానికి తెలీనట్లే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కేసీయార్ ప్రభుత్వం అలాగే వ్యవహరించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీయార్ ఏమిచెబితే అదిమాత్రమే మీడియాలో వచ్చేది జనాలకు తెలిసేది.

పదేళ్ళ అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బయటపడుతున్న విషయాలు చూసి జనాలు ఆశ్చర్చపోతున్నారు. ప్రతిపక్షాలు కేసీయార్ పై రెచ్చిపోతున్నాయి. ఎన్నికల సమయంలోనే కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ బండారం బయటపడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. విచారణ మొదలుపెట్టిన జస్టిస్ చంద్రఘోష్ కమిటి ముందుగా ప్రాజెక్టులను నిర్మించిన కంపెనీలకు నోటీసులు ఇచ్చి సమాధానాలను ఇవ్వమని అడిగింది. వీళ్ళ సమాధానాలు చూసుకుని తర్వాత హరీష్ రావు ఆ తర్వాత కేసీయార్ కు కూడా నోటీసులు ఇవ్వటానికి రెడీ అవుతున్నది. హరీష్ కు ఎందుకంటే అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసింది హరీషే. ప్రాజెక్టుల నిర్మాణంపై ఎవరైనా ఆరోపణలు చేసినా కేసీయార్, హరీష్ వాళ్ళపై విరుచుకుపడిపోయేవారు. ఆరోపణలను చేసిన వారిని తెలంగాణా ద్రోహులుగా చిత్రీకరించేవారు.

ఎన్నికల సమయంలో ప్రాజెక్టుల విషయంలో బయటపడిన లోపాలు, పిల్లర్లు కుంగుబాటుతో ప్రాజెక్టుల నిర్మాణంలోని డొల్లతనం బయటపడింది. అప్పటినుండి ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు పదేపదే ఆరోపణలతో రెచ్చిపోయారు. విచిత్రం ఏమిటంటే లోపాలు బయటపడిన దగ్గర నుండి కేసీయార్, హరీష్ ఎన్నికలు అయిపోయేంతవరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అంటే ఇపుడు కూడా మాట్లాడటంలేదు కాని అంత ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోకుండా ఉంటాయా అనే అడ్డుగోలు వాదనలు కేసీయార్ వినిపించటమే విచిత్రమనిపించింది. అసలు ఒక పిల్లరైనా ఎందుకు కుంగాలి అని అనుకోవాల్సిన కేసీయార్ వందలాది పిల్లర్లలో రెండుకుంగిపోవటం సహజమే అని సమర్ధించుకోవటమే ఆశ్చర్యమేసింది.

హరీష్ అయితే ఇప్పటికీ కాళేశ్వరం, మేడిగడ్డపై నోరెత్తటంలేదు. ఈ నేపధ్యంలోనే జస్టిస్ చంద్రఘోష్ కమీషన్ తొందరలోనే హరీష్ తో పాటు కేసీయార్ కు కూడా నోటీసులు ఇవ్వటం ఖాయం. అప్పుడు కమీషన్ ముందు విచారణకు హాజరైనపుడు ఏమి సమాధానాలు చెబుతారన్న విషయం ఆసక్తిగా మారింది. ప్రాజెక్టుల్లో లోపాలను కప్పిపుచ్చుకోవటం, మీడియాలో ఎక్కడా వార్తలు, కథనాలు రాకుండా చూసుకోవటం, ప్రతిపక్షాలపై విరుచుకుపడినట్లు విచారణకు హాజరైనపుడు మాట్లాడటం కుదరదు. ఎందుకంటే ఇప్పటికే ప్రాజెక్టుల్లోని డొల్లతనాన్ని కేంద్ర జలవనరుల శాఖలోని కీలకమైన విభాగమైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి బయటపెట్టేసింది. కుంగింది 2 పిల్లర్లు కాదని చాలా పిల్లర్లు దెబ్బతిన్నట్లు అథారిటి ప్రకటించింది. అంతేకాకుండా ప్రాజెక్టులోపల భాగంలో చాలాచోట్ల పెద్ద పెద్ద బొక్కలున్నట్లు కూడా చెప్పింది.

అధికారంలో ఉన్నాము కాబట్టి ఏమిచేసినా చెల్లిపోతుందని ఇష్టారాజ్యంగా చేసుకుపోతే అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో జనాలందరికీ తెలుస్తుంది. జస్టిస్ కమీషన్ బహుశా జూన్ చివరలో కాని జూలై మొదటివారంలో కాని ముందుగా హరీష్ కు నోటీసులు ఇవ్వబోతోందని సమాచారం. కమీషన్ విచారణకు హాజరైనపుడు హరీష్ ఏమిచెబుతారన్నది ఆసక్తిగా ఉంది.

Read More
Next Story