చంద్రబాబు, రేవంత్  రాంగ్ సిగ్నల్స్ పంపుతున్నారా ?
x
Chandrababu and Revanth

చంద్రబాబు, రేవంత్ రాంగ్ సిగ్నల్స్ పంపుతున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాము ఇపుడుంటున్న రాష్ట్రాల్లోనే తాము కంటిన్యు అవ్వాలని 11 మంది అఖిల భారత సర్వీసు( ఏఐఎస్) అధికారులు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపైనే ఇపుడు పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తమకు కేటాయించిన రాష్ట్రాల్లో చేరటానికి ఐఏఎస్, ఐపీఎస్ లు ఎందుకు నిరాకరిస్తున్నారనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. కిందిస్ధాయి ఉద్యోగుల బదిలీల విషయంలో కఠినంగా వ్యవహరించే ఐఏఎస్, ఐపీఎస్ లు తమ బదిలీల విషయంలో మాత్రం భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న విషయమే వివాదంగా మారుతోంది.

తెలంగాణాలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఏపీలో రిపోర్టు చేయాలి. అలాగే ఏపీలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు తెలంగాణాలో రిపోర్టు చేయాల్సుంది. వీళ్ళంతా తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఈనెల 16వ తేదీన రిపోర్టు చేయాలి. పై 11 మంది అధికారులను తమ రాష్ట్రాల్లో వెంటనే రిలీవ్ చేసేయాలని, అలాగే రిపోర్టు చేయగానే వెంటనే పోస్టింగులు ఇవ్వాలని డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు జారీచేసింది. ఏఐఎస్ అధికారుల శిక్షణ, క్యాడర్ అలాట్మెంట్, సర్వీసు వ్యవహరాల్లాంటివన్నీ డీవోపీటీనే చూసుకుంటుంది. పై అంశాల్లో కేంద్రహోంశాఖ పరిధిలో పనిచేసే డీవోపీటీ నిర్ణయమే ఫైనల్. అందుకనే డీవోపీటీ అంత పవర్ ఫుల్.

తెలంగాణాలో పనిచేస్తున్న కాటాఅమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, వాణీప్రసాద్, ఎం ప్రశాంతితో పాటు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాషా బిష్త్, అభిషేక్ మహంతి ఏపీలో రిపోర్టుచేయాలి. అలాగే ఏపీలో పనిచేస్తున్న సీహెచ్ హరికిరణ్, కే. సృజన, తోలేటి శివశంకర్ తెలంగాణాలో రిపోర్టు చేయాలి. అయితే ఇపుడు తాము ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ రాష్ట్రంలోనే కంటిన్యు అయ్యేట్లుగా గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. వీళ్ళ అలాట్మెంట్ విషయం ఇప్పటిదికాదు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో క్యాడర్ అలాట్మెంట్ అప్పుడు డీవోపీటీ అందరినీ పనిచేయాలని అనుకుంటున్న రాష్ట్రం విషయంలో ఆప్షన్ అడిగింది. ఆ ఆప్షన్లో వాళ్ళు ఇచ్చిన వివరాల్లో సొంతూళ్ళ ఆధారంగా అప్పట్లోనే వీళ్ళని ఎలాట్ చేసింది. అయితే వీళ్ళు తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్ళకుండా క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యనల్) లో కేసులు వేసి ఓడిపోయారు. ఆ తర్వాత సుప్రింకోర్టులో కూడా కేసులు వేశారు.

సర్వీసు విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోకుండా నిర్ణయాధికారం డీవోపీటీదే అని చెప్పింది. దాంతో అప్పటినుండి వివిధ దశల్లో వీళ్ళతో డీవోపీటీ సెక్రటరీ దీపక్ ఖండేకర్ కమిటి చర్చలు జరిపి ఫైనల్ గా 11 మందిని రెండు రాష్ట్రాలకు బదిలీచేస్తు నిర్ణయం తీసుకున్నది. ఇపుడా నిర్ణయమే వీళ్ళని బాగా కలవరపెడుతోంది. ఎందుకంటే పదేళ్ళుగా ఈ 11 మంది అధికారులు తెలంగాణా, ఏపీలో బాగా అలవాటుపడిపోయారు. పైగా మంచి పోస్టింగుల్లో కూడా ఉన్నారు. ఇపుడు రాష్ట్రం మారిపోతే తమకు మంచిపోస్టింగ్ దక్కదని, సీనియారిటిలో వెనకబడిపోతామనే ఆలోచన ఉన్నట్లుంది. అందుకనే డీవోపీటీ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తున్నట్లుగా వీళ్ళు ముఖ్యమంత్రులను కలిసి తాముంటున్న రాష్ట్రాల్లోనే కంటిన్యు అయ్యేట్లుగా రిక్వెస్టులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ లు రేవంత్ రెడ్డిని, ఏపీ ఐఏఎస్ లు చంద్రబాబునాయుడును కలిసి రిక్వెస్టులు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడుతామని ఇద్దరు ముఖ్యమంత్రులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఐఏఎస్, ఐపీఎస్ లు కలెక్టర్లు, ఎస్పీలుగా పనిచేసినపుడు జిల్లా సిబ్బంది బదిలీల్లో కచ్చితంగా వ్యవహరించారు. బదిలీచేసిన చోటికి వెళ్ళాల్సిందే అని గట్టిగా చెప్పారు. కిందిస్ధాయి ఉద్యోగులకు వర్తింపచేసిన నిబంధనలు ఇపుడు తమకు వర్తించవా ? అనే ప్రశ్న వినబడుతోంది. బదిలీల విషయంలో తమకు ఒక నిబంధన, కిందిస్ధాయి ఉద్యోగులకు మరో నిబంధనా అనే చర్చ జరుగుతోంది. ఇపుడు గనుక ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుని వీళ్ళున్న రాష్ట్రాల్లోనే కంటిన్యు అయేట్లుగా మ్యానేజ్ చేస్తే అది మిగిలిన వాళ్ళకి బ్యాడ్ సిగ్నల్స్ వెళతాయనే చర్చ పెరిగిపోతోంది. కిందిస్ధాయి ఉద్యోగులు బదిలీ అయితే అక్కడ కుదురుకోవటానికి నానా అవస్తలు పడాల్సుంటుంది. కానీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ జిల్లాకు బదిలీ అయినా వాళ్ళ వ్యవహారం వడ్డించిన విస్తరిలాగే ఉంటుంది.

డీవోపీటీనే ఫైనల్ : చంద్రవదన్

ఇదే విషయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఆర్వీ చంద్రవదన్, బండ్ల శ్రీనివాస్ ‘తెలంగాణా ఫెడరల్’ తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చంద్రవదన్ మాట్లాడుతు ‘ఏఐఎస్ అధికారుల బదిలీల విషయంలో డీవోపీటీదే ఫైనల్ నిర్ణయ’మన్నారు. ‘కొన్ని ఏళ్ళుగా తెలంగాణా, ఏపీలో పనిచేస్తున్నారు కాబట్టి తాముంటున్న రాష్ట్రాల్లోనే కంటిన్యు అవుతామని రిక్వెస్టు పెట్టుకోవటంలో తప్పులేద’న్నారు. అలాగే వీళ్ళకోసం పొలిటికల్ బాసులు కేంద్రంతో మాట్లాడటంలో తప్పులేదని చంద్రవదన్ అభిప్రాయపడ్డారు. కానీ ‘వీళ్ళ రిక్వెస్టులు ఆమోదంపొందే అవకాశాలు తక్కువ’న్నారు. ఎందుకంటే ఇప్పటికే సుప్రింకోర్టు, క్యాట్ లో వీళ్ళ అలాట్మెంట్ వ్యవహారం బాగా మురిగిపోయిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్ధను కేంద్రం పటిష్టంగా అమలుచేస్తోందంటే నిబంధనలను కచ్చితంగా అమలు చేయటమే అన్నారు.

2014లోనే ఆప్షన్ల ఆధారంగా కొన్ని తప్పులు జరిగింది వాస్తవమని చెప్పారు. ‘ఇపుడున్న పరిస్ధితుల్లో వీళ్ళు ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ అవకాశాలు కూడా తక్కువే’ అన్నారు. లీగల్ ఆప్షన్ చాలా బలహీనంగా ఉందన్నారు. 16వ తేదీలోగా జాయిన్ అవకపోతే ఏమిచేయాలో డీవోపీటీ చూసుకుంటుందని చెప్పారు.. ‘సర్వీసు, డిసిప్లినరీ విషయాల్లో కేంద్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుంద’ని చంద్రవదన్ అభిప్రాయపడ్డారు. అయినా ‘ఆల్ ఇండియా సర్వీసుకు ఎంపికైనపుడే తాము ఎక్కడైనా పనిచేస్తామని అంగీకరించిన వీళ్ళు ఇపుడు తాముంటున్న రాష్ట్రాల్లోనే కంటిన్యు అవ్వాలని పట్టుబట్టడంలో అర్ధంలేద’ని డాక్టర్ ఆర్వీ చంద్రవదన్ అభిప్రాయపడ్డారు.

డీవోపీటీనే ఫైనల్ కాదు : బండ్ల

‘క్యాడర్ అలాట్మెంట్, డిప్యుటేషన్లు, ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ల విషయంలో డీవోపీటీ నిర్ణయమే ఫైనల్’ అని బండ్ల శ్రీనివాస్ అన్నారు. అయితే ‘డీవోపీటీ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు వీళ్ళు మరోసారి సుప్రింకోర్టుకు వెళ్ళే అవకాశముంద’ని అభిప్రాయపడ్డారు. డీవోపీటీ అన్నది సుప్రింకోర్టు కాదని గుర్తుచేశారు. ‘డీవోపీటీ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు కోర్టుకు వెళ్ళటం వీళ్ళ ఫండమెంటల్ హక్క’ని చెప్పారు. ‘ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ కు ముఖ్యమంత్రులు అంగీకరించినా డీవోపీటీ అంగీకరించకపోతే సాధ్యంకాద’న్నారు. 16వ తేదీన జాయినింగ్ తేదీలోగానే కోర్టులో కేసులు వేసి స్టే తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. అయినా ‘సమాజంలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉండగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల విషయానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేద’ని అభిప్రాయపడ్డారు.

Read More
Next Story