రేవంత్ కు తలనొప్పిగా మారిన చంద్రబాబు ?
x
Naidu and Revanth

రేవంత్ కు తలనొప్పిగా మారిన చంద్రబాబు ?

చంద్రబాబునాయుడు చేసిన సంతకాలను ప్రస్తావిస్తు బీఆర్ఎస్, బీజేపీలు రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నాయి.


ప్రస్తుత సంక్షేమపాలనలో ఒకప్రభుత్వాన్ని మరోప్రభుత్వంతో పోల్చిచూడటం సహజమైపోయింది. పలానా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇక్కడ ఎందుకు అమలుచేయటంలేదని అధికారపార్టీని ప్రతిపక్షాలు నిలదీయటం చాలా సహజం. ఇపుడు తెలంగాణాలో అదే జరుగుతోంది. మొన్నటివరకు కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న పథకాలను చూపించి కేసీయార్ ను నిలదీసేవి. ఇపుడు చంద్రబాబునాయుడు చేసిన సంతకాలను ప్రస్తావిస్తు బీఆర్ఎస్, బీజేపీలు రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నాయి.

ఇక్కడ విషయం ఏమిటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు శనివారం కొన్ని సంక్షేమపథకాల అమలుపై సంతకాలు చేశారు. అందులో మెగా డీఎస్సీ నోటిఫికేషన్, వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగుల పెన్షన్లు పెంపు, అనారోగ్యంతో ఉన్న వారికి ఇచ్చే పెన్షన్, కిడ్నీ బాధితుల పెంన్షన్ను పెంచుతు చంద్రబాబు ఫైళ్ళపై సంతకాలు చేశారు. దీన్నిచూపించి తెలంగాణాలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, బీజేపీ ఎంఎల్ఏ మహేశ్వరరెడ్డి ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఆర్ధికంగా అధ్వాన్నస్ధితిలో ఉన్న ఏపీలోనే చంద్రబాబు పెన్షన్లను పెంచుతు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫైళ్ళపై సంతకాలు పెట్టినపుడు తెలంగాణాలో మాత్రం పెన్షన్లు పెంపు, డీఎస్సీ ప్రకటనను ఎందుకు చేయటంలేదని నిలదీస్తున్నారు. బాధ్యతలు తీసుకున్న తొలిరోజే 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైలుపై చంద్రబాబు సంతకంచేశారు. ఈఏడాది చివరలోనే అన్నీ పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

అలాగే ఇపుడున్న వృద్ధాప్య పెన్షన్ను రు. 3 వేల నుండి నెలకు రు. 4 వేలకు పెంచుతు చంద్రబాబు ఫైలుపై సంతకం చేశారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ను నెలకు రూ. 3 వేల నుండి రు. 6 వేలక పెంచే ఫైలుపై సంతకంచేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ఇపుడిస్తున్న పెన్షన్ను రు. 5 వేల నుండి రు. 15 వేలకు పెంచాలని ఆదేశించారు. ఇక కిడ్నీ బాధితులకు ఇస్తున్న పెన్షన్ను రు. 5 వేల నుండి రు. 10 వేలకు పెంచే ఫైలుపైన సంతకం చేశారు. చంద్రబాబు సంతకాలు చేసిన మెగా డీఎస్సీ, పెన్షన్లు పెంచే సంక్షేమపథకాల ఫైళ్ళని హరీష్ రావు, మహేశ్వరరెడ్డి చూపించి రేవంత్ పై విమర్శలు చేస్తున్నారు. హరీష్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 191 రోజులు అవుతున్నా ఇంతవరకు డీఎస్సీ ప్రకటన, పించన్ల పెంపు ఎందుకు చేయలేదని రేవంత్ ను నిలదీశారు. అధికారంలోకి వచ్చిన నూరురోజుల్లోనే పెంచన్లు పెంచుతామని, డీఎస్సీ ప్రకటిస్తామన్న రేవంత్ మాటలన్నీ అబద్ధాలే అని హరీష్ మండిపడ్డారు. బీజేపీ ఎంఎల్ఏ మహేశ్వరరెడ్డి కూడా ఇవే అంశాలపై రేవంత్ ను వాయించేశారు.

ఇపుడు రేవంత్ కు సమస్య ఎక్కడ వచ్చిందంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్ధితి దాదాపు ఒకేలాగుంది. రెండు ప్రభుత్వాలూ లోటు బడ్జెట్లోనే ఉన్నాయి. రెండు ప్రభుత్వాల నెత్తిన లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. అప్పులుచేయందే రోజుగడిచే పరిస్ధితి రెండు ప్రభుత్వాలకు లేదు. ఏపీకి తెలంగాణాకు పెద్ద తేడా ఏమిటంటే ఆదాయంలో అతిపెద్ద వనరు హైదరాబాద్. తెలంగాణా మొత్తం నుండి వస్తున్న పన్నుఆదాయంలో సగానికి మించి హైదరాబాద్ రాజధాని నుండే వస్తోంది. ఈ వెసులుబాటు ఏపీకి లేదు. ఏపీలో కూడా వైజాగ్ అతిపెద్ద నగరమే అయినా హైదరాబాద్ అంత కాదు కాబట్టి పన్ను ఆదాయం కూడా అంతరాదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబును చూపించి తెలంగాణాలో ప్రతిపక్షాలు నిలదీస్తుండటం రేవంత్ కు పెద్ద తలనొప్పిగా తయారైందనే అనుకోవాలి. మరి హామీల అమలులో రేవంత్ ఏమిచేస్తారో చూడాలి.

Read More
Next Story