తమ్ముళ్ళకు చంద్రబాబు ఫుల్లు క్లాసు
x
Naidu with T leaders

తమ్ముళ్ళకు చంద్రబాబు ఫుల్లు క్లాసు

తొందరలోనే ఒక అడ్ హాక్ కమిటీని వేస్తానని దాని తర్వాత నేతల పనితీరును అధ్యయనం చేసి పూర్తిస్ధాయి కమిటీని వేస్తానన్నారు.


చంద్రబాబునాయుడు తెలంగాణ టిడిపి లీడర్లకు షాక్ ఇచ్చారు ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తమ్ముళ్ళతో ఆయన చాలాసేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీలో ఉన్న కమిటీలను రద్దుచేస్తున్నట్లు చెప్పారు. తొందరలోనే ఒక అడ్ హాక్ కమిటీని వేస్తానని దాని తర్వాత నేతల పనితీరును అధ్యయనం చేసి పూర్తిస్ధాయి కమిటీని వేస్తానన్నారు. ఇదే సమయంలో నేతలకు మనసులో ఏముందో బయటపడ్డారు. కొందరు సీనియర్లమని చెప్పుకుని పార్టీ ఆఫీసులో కూర్చుని డ్రామాలు ఆడుతున్నట్లు మండిపడ్డారు. పార్టీ ఆఫీసులో కూర్చుని తాము చాలా కష్టపడిపోతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని నిష్టూరమాడారు.



జనాల్లోకి వెళ్ళి పార్టీ విధానాలు వివరించకుండా, పార్టీ కార్యక్రమాలను జనాలకు వివరించకుండా ట్రస్ట్ భవన్లో కూర్చుంటే పార్టీ బలోపేతం అవుతుందా అని నిలదీశారు. ఏ ఒక్కనేత పేరును ప్రస్తావించకుండానే అందరినీ ఉద్దేశించి క్లాసు తీసుకున్నారు. అయితే చంద్రబాబు ప్రశ్నలు ఎవరికి తగలాలో నేరుగా వాళ్ళకే తగిలింది. ఏపీలో అధికారంలోకి వచ్చినట్లే తెలంగాణాలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను చంద్రబాబు వ్యక్తంచేశారు. అయితే అందుకు నేతలు చేయాల్సిన పనులున్నాయన్నారు. అవేమిటంటే ముందుగా సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని చేయాలి. అలాగే పార్టీ విధానాలను జనాలకు వివరించాలి. జనాల్లోకి తిరిగితే సమస్యలు ఏమిటో తెలుస్తాయన్నారు. సమస్యల పరిష్కారానికి టీడీపీ ఉంది అనే భరోసాను జనాలకు నేతలు కల్పించాలన్నారు.




పార్టీబలోపేతానికి బీసీలు ముఖ్యంగా యువకులకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. తొందరలోనే ప్రారంభించబోయే ఆన్ లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడ్ హాక్ కమిటి సభ్యులే జిల్లాల్లో పర్యటించి పర్యవేక్షించాలని కూడా చెప్పారు. పార్టీ బలోపేతానికి ఇతర పార్టీల్లో నుండి వచ్చే నేతలను చేర్చుకోవాలని సూచించారు. చంద్రబాబు చెప్పిందాంట్లో చిన్న లాజిక్ ఉంది. అదేమిటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ లో చాలామంది నేతలు టీడీపీలో నుండి వెళ్ళినవారే. బీఆర్ఎస్ పదేళ్ళలో కాని ఇప్పటి కాంగ్రెస్ లో కాని రేవంత్ రెడ్డితో సహా చాలామంది మాజీ తమ్ముళ్ళన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బహుశా చంద్రబాబు పై విధంగా చెప్పుంటారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, సినీనటుడు బాబూ మోహన్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరి తమ్ముళ్ళకి చంద్రబాబు తీసుకున్న క్లాసు ఎంతమాత్రం పనిచేస్తుందో చూడాలి.

Read More
Next Story