‘బాబు కోవర్టులపై ఉక్కుపాదం మోపండి’
x

‘బాబు కోవర్టులపై ఉక్కుపాదం మోపండి’

బనకచర్ల ఆగాలంటే నీరు, కరెంట్ కట్ చేయాల్సిందేనని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్ట్ వివాదంతో ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటలయుద్ధాలు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై స్పందించిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బనచర్లను ఆపాలంటే కేంద్రానికి లేఖలు రాస్తే సరిపోదని మంత్రి ఉత్తమ్ కుమార్‌కు సూచించారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే బనకచర్ల బంద్ అవుతుందన్నారు. ‘‘తెలంగాణలో బాబుకు ఉన్న కోవర్టులే ఇరిగేషన్, రోడ్డు కాంట్రాక్ట్‌లు చూస్తారు. వారికి వాటన్నింటిని ఆపేసి, ఒక్క రూపాయి కూడా రాకుండా చేయాలి. తెలంగాణకు నీళ్లు, విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచర్ల లాంటి ప్రాజెక్ట్‌లను నిర్మించడం అభ్యంతరకరం. ఇది తెలంగాణ ప్రజల హక్కులను కాలరాయడమే. ముందు తెలంగాణలోని బాబు కోవర్డులను ఆపితే.. బనకచర్ల అదే ఆగుతుంది’’ అని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చాలకు దారితీస్తున్నాయి.

అనిరుధ్ టార్గెట్ ఎవరు?

ఇదివరకు కూడా చంద్రబాబుపై అనేకసార్లు ఘాటు వ్యాఖ్యలు, విమర్శలు చేశారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. కానీ తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని, వారే ఇరిగేషన్, రోడ్డు ప్రాజెక్ట్ చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారన్న చర్చలు జోరందుకున్నాయి. కొందరు విశ్లేషకులు మాత్రం.. పార్టీలోని కొందరు నేతలను ఉద్దేశించే అనిరుధ్ ఈ వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగానే ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఇరిగేషన్, రోడ్డు ప్రాజెక్ట్‌లు వంటివి ఆ పార్టీ నేతలు, వారికి అనుయాయువులకు వస్తాయని, అలాంటిది ఇప్పుడు అనిరుధ్ అంటున్న బాబు.. కోవర్టులు అంటే.. గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినవారే అయ్యుండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Read More
Next Story