
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బాబు ఫోకస్.. అప్పుడే నిర్ణయం..
తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే తెలంగాణలో టీడీపీ నేతలతో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, అతి త్వరలో జరిగే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇందుకు మంచి వేదిక అవుతాయని ఆయన భావించారు. ఇందులో భాగంగానే ఆయన తెలంగాణలోనే టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో ఏం చేయాలి? అన్న అంశంపై ప్రధానంగా చర్చించారు. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలి? టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపాలా? లేకుంటే ఇక్కడ కూడా బీజేపీతో కలిసి కూటమిగా ముందుకు సాగాలా? అన్న అంశాలను కూడా చర్చించారు. కాగా ఈ అంశంపై బీజేపీతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు తెలిపినట్లు సమాచారం.
మూడు జిల్లాల్లో పట్టు..
తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే టీడీపీ సభ్యత్వ నమోదును కూడా చేపట్టారు. ఇప్పుడు కూడా రెండు, మూడు జిల్లాల్లో పట్టు ఉందని టీడీపీ నేతలు చెప్తున్నారు. దీంతో అక్కడి నుంచి మళ్ళీ పార్టీని విస్తరించాలని టీడీపీ ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకు తెలంగాణలో వచ్చే ఎన్నికలను వేదికగా మర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వరుస పరాభవాలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్తా తెలంగాణ, ఆంధ్రగా విడిపోయినప్పటి నుంచి తెలంగాణలో టీడీపీ ప్రభను కోల్పోయింది. ఎన్నికల్లో పలుసార్లు పోటీకి దిగినా ఘోర పరాభవాలే పార్టీని పలకరించాయి. 2018 ఎనికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికల బరిలో దిగినా ఎటువంటి లాభం లేకుండా పోయింది. దాంతో ఆ తర్వాత నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే టీడీపీ ఫోకస్ పెట్టింది. అయితే ఆంధ్రలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు మరోసారి తెలంగాణ వైపు చూస్తోంది. మరి ఈసారి చంద్రబాబు ప్రణాళికలు ఏమాత్రం సక్సెస్ అవుతాయో చూడాలి.