రూటు మార్చిన చంద్రబాబు
x
Chandrababu

రూటు మార్చిన చంద్రబాబు

స్వచ్చంధ సేవా కార్యక్రమాలతో ముందు పార్టీ ఉనికిని చాటుకోవాలని ఆదేశించారు.


పార్టీని బలోపేతం చేయాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచన. అధికారంలో ఉన్నపార్టీని ఇంకా ఏమి బలోపేతం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారా అని మీరు ఆలోచిస్తున్నారా ? పార్టీని బలోపేతం చేయాల్సింది ఏపీలో కాదు తెలంగాణాలో. ఇపుడు చంద్రబాబు ఆలోచనలు తెలంగాణా మీదే ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్నా తెలంగాణాలో మాత్రం పార్టీ దాదాపు భూస్ధాపితమైపోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రాకపోయుంటే పార్టీ పరిస్ధితి రెండు రాష్ట్రాల్లోను డిఫరెంటుగా ఉండేది. ఏపీలో అధికారంలోకి వచ్చింది కాబట్టే అర్జంటుగా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయటంపై దృష్టిపెట్టారు.

ఇపుడున్న పరిస్ధితుల్లో తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయటం కష్టమైన పనే. ఎలాగంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తర్వాత ప్రతిపక్షం బీజేపీనే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చంద్రబాబు భాగస్వామి. ఇపుడు టీడీపీని బలోపేతం చేయాలంటే ముందుగా చంద్రబాబు దృష్టి పెట్టాల్సింది బీఆర్ఎస్ నేతల మీదే. ఎంతమంది వీలుంటే అంతమంది కారుపార్టీ నేతలను పార్టీలోకి తీసుకుంటే టీడీపీ అంతగా బలోపేతమవుతుంది. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయి. ప్రజాప్రతినిధులను పార్టీలోకి చేర్చుకోవటంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ద్వితీయశ్రేణి నేతలను చేర్చుకోవటంలో బీజేపీ చొరవ చూపిస్తోంది.

అంటే ఏదో స్ధాయిలో బీఆర్ఎస్ ను కాంగ్రెస్, బీజేపీలు చీల్చి చెండాడేయాలని ప్లాన్డుగా అడుగులు వేస్తున్నాయి. మధ్యలో చంద్రబాబు యాక్టివ్ అయ్యారంటే ప్రజాప్రతినిధులు కాకుండా ఎంతో కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరుతారు. అప్పుడు బీజేపీ నష్టపోతుంది. ఒకవేళ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కాంగ్రెస్ లో కాకుండా టీడీపీలో చేరితే అప్పుడు హస్తంపార్టీ కూడా నష్టపోవటం ఖాయం. ఇదే జరిగితే టీడీపీ ఎంతోకొంత లాభపడుతుంది కాని కాంగ్రెస్, బీజేపీలకు మైనస్ అనే చెప్పాలి. చంద్రబాబు ప్లాన్ వల్ల బీఆర్ఎస్ కు జరగాల్సినంత నష్టం జరగదు. ఎన్నిపార్టీలు యాక్టివ్ అయితే బీఆర్ఎస్ కు అంత ప్లస్. బీఆర్ఎస్ గట్టిగా ఉన్నంతవరకు టీడీపీకి తెలంగాణాలో చోటు దక్కకపోగా బీజేపీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది. రేవంత్ టార్గెట్ కూడా అనుకున్నంతగా రీచ్ కాలేరు.

అందుకనే ఈ విషయాలన్నింటినీ గ్రహించిన చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలతో కాకుండా స్వచ్చంధ సేవా కార్యక్రమాలతో ముందు పార్టీ ఉనికిని చాటుకోవాలని ఆదేశించారు. గురువారం జరిగిన పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో తెలంగాణా నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులుతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముందుగా తెలంగాణాలోని 119 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఇందులో కూడా యువతకు పెద్ద పీట వేయాలని చెప్పారు. వీలైనంత సభ్యత్వ నమోదు చేయించి రాజకీయంగా కాకుండా సోషల్ యాక్టివిటీస్ తో పార్టీని జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళేట్లుగా చర్యలు తీసుకోమని చెప్పారు. ముందుగా జనాల్లోకి స్వచ్చంధ కార్యక్రమాల ద్వారా పార్టీని జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళేట్లు చేస్తే పార్టీ దానంతట అదే బలోపేతం అవుతుందన్నారు.

ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న కారణంగా చంద్రబాబు వల్ల తెలంగాణాలో బీజేపీకి ఇబ్బంది ఎదురైతే ఢిల్లీ నాయకత్వం ఒప్పుకోదు. ఇదే సమయంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో రేవంత్ రెడ్డి చాలా కీలకం. రేపేదైనా ఎన్డీయేతో తేడా వస్తే ఇండియా కూటమిలోకి వెళ్ళాలంటే చంద్రబాబుకు రేవంత్ అవసరం చాలా ఉంటుంది. అందుకనే ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్ కు ఇబ్బంది కలగకూడదంటే రాజకీయంగా కాస్త స్లోగా వెళ్ళాల్సిందే. అందుకనే రాజకీయ కార్యకలాపాలు అని కాకుండా సభ్వత్యనమోదు, స్వచ్చంధ కార్యక్రమాలతో జనాల్లో చొచ్చుకుని వెళ్ళాలన్నది చంద్రబాబు ప్లాన్. ఎన్నికలవరకు జాగ్రత్తగా తన ప్లాన్ అమలుచేస్తే అప్పటి పరిస్ధితులను బట్టి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు తెలంగాణా నేతలకు హామీ ఇచ్చారు. ఈలోపు రాజకీయంగా నేతలు ఎదగటానికి వీలుగా ఏపీలో అవకాశం ఉన్న నామినేటెడ్ పదవులను కేటాయించాలని కూడా డిసైడ్ అయ్యారు. మొత్తంమీద చంద్రబాబు కొత్త రూటు ఏమాత్రం వర్కవుటవుతుందో చూడాలి.

Read More
Next Story