మొదటి అడుగువేసిన చంద్రబాబు
తెలంగాణాలోని బీసీ సామాజికవర్గాలు+ సీమాంధ్రులు సాలిడుగా పార్టీకి మద్దతుగా నిలబడటంతో పార్టీకి ఎదురులేకుండా పోయింది.
చంద్రబాబునాయుడు మొదటి అడుగువేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణాలో కూడా టీడీపీ(TDP)ని బలోపేతం చేయాలని చంద్రబాబు(ChandrababuNaidu) డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణాలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయంలో ఇప్పటికే తమ్ముళ్ళతో చాలాసార్లు భేటీ అయ్యారు. తన ఆలోచనలను తమ్ముళ్ళతో షేర్ చేసుకున్న సమయంలోనే తమ్ముళ్ళ నుండి కూడా సలహాలు, సూచనలు తీసుకున్నారు. తెలంగాణా(Telangana)లో టీడీపీ పరిస్ధితి దయనీయంగా ఉందని అందరికీ తెలిసిందే. పదేళ్ళు పాటు పార్టీ ఉనికి కూడా తెలంగాణాలో కనబడలేదు. తెలంగాణాలో తెలుగుదేశంపార్టీ ఉంది అంటే ఉందన్నట్లుగానే వ్యవహరించింది. పార్టీ సీనియర్ నేతల్లో చాలామంది బీఆర్ఎస్, కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. నేతలతో పాటు క్యాడర్ కూడా చాలాజిల్లాల్లో వెళ్ళిపోయింది.
దాంతో పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్ళే నేతలు కూడా కరువయ్యారు. ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా కేవలం మీడియా, సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైపోయారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయటం కోసం మొదటి అడుగు వేశారు. అదేమిటంటే పార్లమెంటు నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించారు. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో హైదరాబాద్ పార్లమెంటు సీటును వదిలేసి మిగిలిన 16 నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించారు. ఇపుడు కన్వీనర్లను నియమించిన చంద్రబాబు తొందరలోనే పూర్తిస్ధాయి కమిటీలను కూడా వేయబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
మిగిలిన హైదరాబాద్(Hyderabad) కన్వీనర్ తో పాటు కమిటిని వేయాలని డిసైడ్ అయ్యారు. ఇపుడు నియమించిన కన్వీనర్లతోనే 119 నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని టేకప్ చేయబోతున్నారు. నిజానికి సమైక్యరాష్ట్రంలో టీడీపీ బలంగా ఉండేదంటే అందుకు తెలంగాణాయే కారణం. తెలంగాణాలోని బీసీ సామాజికవర్గాలు+ సీమాంధ్రులు సాలిడుగా పార్టీకి మద్దతుగా నిలబడటంతో పార్టీకి ఎదురులేకుండా పోయింది. అలాంటిది రాష్ట్ర విభజన కారణంగా పార్టీపై దెబ్బపడింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు తన పరిపాలనను హైదరాబాద్ నుండి విజయవాడ(Vijayawada)కు వెళ్ళిపోవటం తర్వాత పాలనను అమరావతి(Amaravathi)కి మార్చటంతో తెలంగాణాలో పార్టీ నేలమట్టమైపోయిందనే చెప్పాలి. ఏపీలో కూడా 2019లో పార్టీ ఓడిపోవటంతో తెలంగాణాలో పార్టీపైన చంద్రబాబు దృష్టిపెట్టలేదు.
అయితే 2024లో ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావటంతోనే తెలంగాణాలో కూడా పార్టీ బలోపేతానికి చంద్రబాబు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ముందు నియోజకవర్గాల్లో సభ్యత్వాలు చేయించాలని డిసైడ్ అయ్యారు. సభ్యత్వాలు చేయించటం కోసమే ఇపుడు పార్లమెంటు నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించింది. కన్వీనర్లంతా ముందు సభ్యత్వాలు చేయించటంపై దృష్టిపెడితే తర్వాత పూర్తిస్ధాయి కమిటీలను ఆ తర్వాత రాష్ట్ర కమిటిని నియమించాలన్నది చంద్రబాబు ఆలోచన. తొందరలోనే జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లోగా ఎంత వీలైత అంతగా సభ్యత్వ నమోదును పూర్తిచేస్తే పార్టీ బలం ఏమిటన్న విషయంలో ఒక అంచనాకు రావచ్చని చంద్రబాబు అనుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
పార్టీ సభ్యత్వాలను బట్టి స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాల వద్దా అని చంద్రబాబు డిసైడ్ చేస్తారు. ప్రతి నియోజకవర్గంలోను పార్టీకి మద్దతుదారులు, అభిమానులు ఇంకా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే గట్టినేత కనబడటంలేదు. అందుకనే తొందరలోనే చంద్రబాబు ఘర్ వాపసీ పిలుపు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఎలాగంటే గతంలో పార్టీని వదిలేసి ఇతర పార్టీల్లో చేరిన నేతలందరినీ తిరిగి టీడీపీలో చేరాలని చంద్రబాబు పిలుపివ్వబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) లోని టీడీపీ నేతల్లో ఇదే విషయమై చర్చలు కూడా జరుగుతున్నాయి. తాను తొందరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు తీగల కృష్ణారెడ్డి చేసిన ప్రకటన ఇందులో భాగమనే అనుకోవాలి. ఇప్పటికే చంద్రబాబుతో ఫిరాయింపు ఎంఎల్ఏలు అరెకపూడి గాంధి, ప్రకాష్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు, మనవరాలి వివాహాం ఆహ్వానం పేరుతో ఎంఎల్ఏలు, మామా, అల్లుళ్ళు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి తదితరులు భేటీ అయిన విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే పార్టీని వదిలేసిన సినీ నటుడు, మాజీమంత్రి బాబూమోహన్ ఆంధోల్ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.
వివిధ పార్టీల్లోని తమ్ముళ్ళను టీడీపీలోకి ఆకర్షించేందుకు చంద్రబాబు చాపకింద నీరు లాంటి ప్రయత్నాలు చేస్తునే మరోవైపు సభ్యత్వాలు చేయించేందుకు కన్వీనర్లను నియమించారు. సభ్యత్వాలు గనుక సక్రమంగా జరిగితే క్షేత్రస్ధాయిలో పార్టీకి ఎంతమాత్రం ఆధరణ ఉందన్న విషయంలో ఒక అంచనాకు రావచ్చు. దాని ప్రకారం పార్టీ కార్యక్రమాల నిర్వహణను డిసైడ్ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
తెలంగాణాలో నెగిటివ్ పాయింట్
ఇప్పటికిప్పుడు పార్టీని తెలంగాణాలో బలోపేతం చేయాలంటే చంద్రబాబుకు ఒక సమస్య అడ్డుపడుతోంది. అదేమిటంటే రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రిగా ఉండటమే. చంద్రబాబుకు రేవంత్ అత్యంత సన్నిహితుల్లో ఒకడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీకి ఆంధ్రాపార్టీ అనే ముద్ర బలంగా పడిపోయింది. తెలంగాణాలో టీడీపీ బలోపేతానికి చంద్రబాబు తీసుకునే ప్రతిచర్యా కాంగ్రెస్ ను బలహీనం చేసి బీఆర్ఎస్ ను బలోపేతం చేసే ప్రమాధం కూడా ఉంది. కాంగ్రెస్ బలహీనపడినా, బీఆర్ఎస్ బలోపేతమైనా టీడీపీకి తెలంగాణాలో అనుకున్నంత మైలేజి రాదు. తెలంగాణా ఏర్పడిన తర్వాత మొదటి రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకు ప్రధాన కారణం తెలంగాణా సెంటిమెంటే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే 2023లో జరిగిన మూడో ఎన్నికలో తెలంగాణా సెంటిమెంటు అంతగా వర్కవుట్ కాలేదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు మంచి ఫలితాలు వస్తే మిగిలిన రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లొచ్చాయి. రాబోయే ఎన్నికల్లో పరిస్ధితి ఎలాగ ఉండబోతుందో ఇపుడే ఎవరూ అంచనాలు వేయలేరు. జమిలి ఎన్నికలు జరగటం ఖాయమనే నేపధ్యంలో బీజేపీ(BJP) పరిస్ధితి ఎలాగుంటుంది అని ఇపుడే ఎవరూ చెప్పలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల వ్యవహారం ఎలాగున్నా ముందయితే స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలుపును చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనబడుతోంది. టార్గెట్లో గనుక మంచి ఫలితాలు వస్తే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అందుకనే కన్వీనర్ల నియామకం పేరుతో చంద్రబాబు తెలంగాణాలో మొదటి అడుగు వేశారు. మరి రెండో అడుగు ఎప్పుడు, ఎలాగుంటుందో చూడాల్సిందే.