ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ముందడుగు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు మరో కీలక అడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ఆరుగురిని నిందితులుగా చేరుస్తూ నేడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు మరో కీలక అడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... మరో ఆరుగురిని నిందితులుగా చేరుస్తూ నేడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, సస్పెండె అయిన అధికారులు ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ ని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే.
మరో వైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్ గూడ జైల్లో ఉన్న అడిషినల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు లో వాదనలు వినిపించారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియడంతో బుధవారం తీర్పు వెల్లడించనున్నట్టు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రివ్యూ:
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పలువురు ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు, జడ్జీలు, జర్నలిస్టులు, రియల్టర్లు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుుకుంది. పోలీసులు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పోలీసులతో రివ్యూ జరిపారు. ఆయన అధికారులతో భేటీ అయిన మరుసటి రోజే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ అయింది.