
ప్రేమ పేరుతో యువతిపై దౌర్జన్యం..
దాడి చేసి.. పోలీసులకు చెప్తే యాసిడ్ పోస్తా అంటూ బెదిరింపులు.
ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్ నగరానికి వచ్చిన యువతిని మోసం చేసిన యువకుడిని పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. గుంటూరుకు చెందిన ఓ యువతి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునేందుకు కొన్ని నెలల క్రితం హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టింది. ఆర్థిక ఇబ్బందుల మూలంగా డిజైనింగ్ కోర్సును మధ్యలో ఆపేసింది. బతుకు దెరువుకోసం ల్యాకో హిల్స్ వద్ద ఓ ప్రయివేటు సంస్థలో టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ గా చేరింది. ఒంటరిగా ఉన్న యువతి సెక్యురిటీ దృష్ట్యా సోమాజిగూడ కపాడియా లైన్ లోని ఓ అపార్ట్ మెంట్ లో స్నేహితులతో బస చేసింది. ఆమె పని చేస్తున్న సంస్థలో నే భానుప్రసాద్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒకే సంస్థ కావడంతో సదరు యువతితో భాను ప్రసాద్ పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది.
ఒక రోజు యువతి నివసిస్తున్న ప్లాట్ లోకి భాను ప్రసాద్ వచ్చాడు. స్నేహితులను బెదిరించి యువతిపై లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. యాసిడ్ పోసి ఎందుకు పనికి రాకుండా చేస్తానని బెదిరించాడు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి చైతన్య నగర్ లో ఉంటున్న భాను ప్రసాద్ యువతిని పెళ్లి చేసుకుంటానని బుకాయించాడు. ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో బాధితురాలిని తిట్టడం, కొట్టడం చేసేవాడు. ఆమె మధ్య చేతి వేలు గోళ్లు కత్తిరించి కత్తెరతో దాడి చేసి దౌర్జన్యం చేశాడు. ఈ నెల 26న రాత్రి రెండున్నరకు వచ్చి దాడి చేయడంతో బాధితురాలు విషయాన్ని స్నేహితులకు చేరవేసింది. రెండ్రోజుల తర్వాత బాధితురాలు, స్నేహితురాళ్లతో కల్సి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాను ప్రసాదర్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న భాను ప్రసాద్ పలు నేరాల్లో నిందితుడని పోలీసులకు సమాచారమందింది .

