చర్లపల్లి చెరువుకు మహర్దశ, పర్యాటక విహార కేంద్రంగా అభివృద్ధి
x
చర్లపల్లి పెద్ద చెరువు : ఇక విహార యాత్రా కేంద్రం

చర్లపల్లి చెరువుకు మహర్దశ, పర్యాటక విహార కేంద్రంగా అభివృద్ధి

తెలంగాణ జైళ్ల శాఖ, హైడ్రా సంయుక్తంగా పారిశ్రామికవేత్తల సీఎస్ఆర్ నిధులతో చర్లపల్లి పెద్ద చెరువును పర్యాటక, విహార కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చ‌ర్ల‌ప‌ల్లి పెద్ద చెరువు రూపు రేఖ‌లు మార‌నున్నాయి. చర్లపల్లి జైలు సమీపంలో ఉన్న ఈ చెరువును మంచినీటి స‌ర‌స్సుగా రూపొందించ‌డ‌మే కాకుండా న‌య‌న మ‌నోహ‌రంగా తీర్చిదిద్ద‌నున్నారు.

- చ‌ర్ల‌ప‌ల్లి జైలు ప్రాంతంలో ఉన్న 58 ఎక‌రాల చ‌ర్ల‌ప‌ల్లి చెరువును ఆధునికీక‌రించ‌డంతో పాటు సుంద‌రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. చెరువు చుట్టూ తిరిగి ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌ల‌ను జైళ్ల శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ సౌమ్యా మిశ్రా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగ‌నాథ్‌ లు ప‌రిశీలించారు.
- ప్ర‌స్తుతం చెరువులో కొద్దిమొత్తంలోనే నీరు ఉన్నా ప‌రిశుభ్రంగా ఉండ‌డంతో జీవ‌వైవిద్యానికి అవ‌కాశం ల‌భించనుంది. ఈ వర్షాకాలంలో ఈ చెరువు నిండిపోయి మ‌రింత ఆహ్లాదంగా మారనుంది. ఈ క్ర‌మంలో చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, ప‌ర్యాట‌క‌, విహార కేంద్రంగా తీర్చిదిద్ద‌ాలని నిర్ణయించారు.

చెరువు చుట్టూ ఫెన్సింగ్
చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు చెరువు క‌ట్ట‌ను బ‌లోపేతం చేసి పాత్‌వేను అభివృద్ధి చేయాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. చెరువు చుట్టూ సోలార్ లైటింగ్ సిస్టమ్‌తో పాటు సీసీటీవీ కెమేరా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తే మ‌రింత భ‌ద్ర‌త ఉంటుంద‌ని భావించారు. ఇలా చెరువులో మంచి నీరు నిలిచేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను అధికారులు చ‌ర్చించారు.చర్లపల్లి చెరువు అభివృద్ధి గురించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాల‌ని హైడ్రా ఇరిగేష‌న్ ఇంజినీరింగ్ విభాగానికి హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు సూచించారు. జైళ్లశాఖ‌, హైడ్రాతో పాటు స్థానిక రెవెన్యూ, ఇరిగేష‌న్‌, జీహెచ్ ఎంసీ అధికారులు చెరువు అభివృద్ధి కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.



గొలుసుక‌ట్ట‌ చెరువులు

హ‌కీంపేట నుంచి నాగిరెడ్డి కుంట‌, కాప్రా చెరువు, మోతుకుల‌కుంట‌, బైస‌న్‌కుంట గొలుసుక‌ట్ట‌ చెరువుల ద్వ‌ారా చ‌ర్ల‌ప‌ల్లి పెద్ద చెరువుకు నీరందుతుంది. ఈ చెరువులో మురుగు నీరు క‌ల‌వ‌కుండా డైవ‌ర్ట్ నాలా కూడా ఉంది. చెరువు చుట్టూ దాదాపు 3 కిలోమీట‌ర్ల మేర న‌డ‌క దారి అందుబాటులోకి రానుంది. చుట్టూ పాత్‌వే, మినీ పార్కులు, చెట్లు, సీటింగ్ సౌక‌ర్యం క‌ల్పించాలని నిర్ణయించారు. సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేస్తే స్థానికులే కాకుండా ఇదో విహార కేంద్రంగా అభివృద్ధి కానుంది.

చెరువు అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు
చ‌ర్ల‌ప‌ల్లి ప‌రిశ్ర‌మ‌లకు చెందిన ప్ర‌తినిధులు సామాజిక బాధ్య‌త (సీఎస్ ఆర్‌) కింద నిధులు స‌మ‌కూర్చ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని జైళ్ల శాఖ డైరెక్టర్ సౌమ్య మిశ్రా చెప్పారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఎంత ఖ‌ర్చు అవుతుందో స‌మ‌గ్ర నివేదిక ఇస్తే ఆ క్ర‌మంలో సీఎస్ ఆర్ నిధులు అడ‌గ‌డానికి వీలవుతుంద‌న్నారు. అంత‌కు ముందు చెరువుకు సంబంధించిన వీడియో చిత్రాల‌ను, చెరువు అభివృద్ధికి చెందిన ప్ర‌ణాళిక‌ల‌ను జైళ్ల శాఖ అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌లో చూపించారు.


Read More
Next Story