కారు దిగి.. హస్తం అందుకున్న రంజిత్ రెడ్డి
x
రంజిత్ రెడ్డి

కారు దిగి.. హస్తం అందుకున్న రంజిత్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.



పార్లమెంట్ ఎన్నికల నగారా మోగిన వేళ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ షాక్ నుంచి పార్టీ, కార్యకర్తలు తేరుకోకముందే పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పా హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రంజిత్ రెడ్డి తన రాజీనామా లేఖను ఆయన కేసీఆర్‌కు పంపారు. అంతేకాకుండా తన రాజీనామా అంశాన్ని ట్విట్టర్ వేదికగా కూడా వెల్లడించారు. తన రాజీనామాకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులే కారణమని చెప్పారాయన. తన రాజీనామా లేఖలో తనకు ప్రజా సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ టికెట్‌ను తనకు ఇవ్వలేదన్న కారణంగానే రంజిత్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం.

ప్రస్తుత పరిస్థితులే కారణం

‘‘ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే బీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్లూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన పార్టీకి, పార్టీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్‌కు, నాకు అన్ని దశల్లో మద్దతుగా నిలిచిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నా రాజీనామాను ఆమోదించాలని పార్టీ అధినేత కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసుకుంటున్నా. పార్టీని వీడటం బాధాకరంగానే ఉన్నా ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు’’అని తెలిపారు రంజిత్ రెడ్డి.

హస్తం కండువా కప్పుకున్న రంజిత్

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ టికెట్ మరోసారి తనకే దక్కుతుందని భావించారు రంజిత్ రెడ్డి. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఈసారి టికెట్‌ను రంజిత్‌కు కాదని జ్ఞానేశ్వర్‌కు ఇచ్చింది. ఈ విషయాన్ని గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రంజిత్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన రెండు రోజుల క్రితమే ‘పోరాడితే పోయేదేం లేదు’’అని ట్విట్టర్ పోస్ట్ ద్వారా బహిర్గతం చేశారు. దీంతో ఆయన పార్టీ మారడానికి సన్నద్ధమయ్యారని, అతి త్వరలోనే బీఆర్ఎస్‌కు ఝలక్ ఇస్తారంటూ వార్తలొచ్చాయి. అదే విధంగా ఈరోజు ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పాల్గొన్నారు. రంజిత్ రెడ్డి చేరిక తమ పార్టీ గెలుపుకు ఊతమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.





Read More
Next Story