
‘ముఖ్యమంత్రి ఫిరాయింపు నేతలను ప్రోత్సహిస్తున్నాడు’
మాజీమంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ఫిరాయింపు ఎమ్మెల్యేలు, నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత స్వంత పార్టీ నాయకులకు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. జగిత్యాల జిల్లా నూతన డిసీసీ అధ్యక్షుడు నందయ్యకు తన ఇంట్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో జీవన్ రెడ్డి ప్రసంగించారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఫిరాయింపు నేతలకే అధిక ప్రాధాన్యత నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కన్న తల్లి వంటి కాంగ్రెస్ పార్టీ తన బిడ్డలను కాపాడుకుంటోంది కాని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి, జగిత్యాల బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్లు బిఆర్ఎర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ నియోజకవర్గానికి చేసింది శూన్యమన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలోనే జీవన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

