రేవంత్ అంకుల్... మా ప్రాణాలకి రక్షణ ఏది?
కుక్కల బారి నుండి తమ ప్రాణాలు కాపాడండి అంటూ కొంతమంది చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.
హైదరాబాద్ లో కుక్కల బెడద ప్రాణాంతకంగా మారింది. ఇటీవల జవహర్ నగర్ లో సంవత్సరంన్నర బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారు. ఏ క్షణాన తమ పిల్లలకి కుక్కల నుండి అపాయం ముంచుకొస్తుందో అని కలత చెందుతున్నారు.
ఈ క్రమంలో కుక్కల బారి నుండి తమ ప్రాణాలు కాపాడండి అంటూ కొంతమంది చిన్నారులు ఆదివారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గం, కొంపల్లి లోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. ఆ కుక్కల నుండి తమ ప్రాణాలకి రక్షణ కల్పించండి అంటూ స్థానిక కాలనీల్లో నివాసం ఉండే చిన్నారులు, తమ తల్లిదండ్రులతో కలిసి ఆదివారం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. కుక్కల విషయంపై ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని కంప్లైంట్ చేశారు. కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ల పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రులు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునేనాధుడే కరువయ్యాడని వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని మండిపడుతున్నారు. కాలనీల్లో ప్రజలు బైటికి రాలేనంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. వాటి బారి నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నో సార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ అంకుల్ మా ప్రాణాలకి రక్షణ ఏది?
పోలీస్ స్టేషన్ వద్ద చిన్నారులంతా నిరసన వ్యక్తం చేశారు. వీధి కుక్కల నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రేవంత్ అంకుల్, కమిషనర్ అంకుల్, వివేక్ అంకుల్ (స్థానిక ఎమ్మెల్యే) మాకు రక్షణ ఏది? వీధికుక్కలు బారిన పడి మా ప్రాణాలు పోవాల్సిందేనా? మాకు రక్షణ ఏది? అంటూ రాసిన ప్లకార్డులు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.