
స్కూలు బస్సు దగ్ధం..తృటిలో తప్పించుకున్న పిల్లలు
అందరు రావటంతో బస్సు తలుపు తెరిచి పిల్లలందరినీ స్ధానికుల సాయంతో కిందకు దించేశాడు
స్కూలు పిల్లలు తృటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు. శనివారం ఉదయం నారాయణఖేడ్ లోని ఒక ప్రైవేటు స్కూలు బస్సు(School bus) పిల్లలతో వెళుతోంది. కొంతదూరం వెళ్ళిన తర్వాత బస్సు ఇంజన్లో నుండి పొగలు రావటాన్ని డ్రైవర్ గమనించాడు. కర్నూలు(Kurnool bus accident)లో జరిగిన బస్సుప్రమాదం గుర్తున్న కారణంగానో ఏమో డ్రైవర్ చాలా అప్రమత్తతో వ్యవహరించాడు. పొగలు మొదలవ్వగానే వెంటనే డ్రైవర్ బస్సు ఇంజన్ ఆపేశాడు. పిల్లలను అప్రమత్తంచేసి స్ధానికులను కూడా కేకలు వేసి పిలిచాడు. అందరు రావటంతో బస్సు తలుపు తెరిచి పిల్లలందరినీ స్ధానికుల సాయంతో కిందకు దించేశాడు.
అక్కడ గుమిగూడిన జనాల్లో ఎవరో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. కొద్దిసేపటికి అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పాటు స్ధానికులు సాయంచేయటంతో బడిపిల్లలందరు క్షేమంగా బయటపడ్డారు. బస్సులో సుమారు 30 మంది పిల్లలున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి కారణాలు తెలియాల్సుంది.

