
చిలుకూరు టెంపుల్ అర్చకుడిపై దాడి
వీసా బాలాజీ ఆలయంగా పాపులరైన చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన ఆర్చకుడు రంగరాజన్ కుటుంబంపై దాడిజరిగింది
వీసా బాలాజీ ఆలయంగా పాపులరైన చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన ఆర్చకుడు రంగరాజన్ కుటుంబంపై దాడిజరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన దాడి విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలీని వ్యక్తులు ప్రవేశించి రంగరాజన్ (Chilukuru temple Priest Rangarajan) పై దాడిచేసినట్లు ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తన ఫిర్యాదులో రంగరాజన్ తో పాటు కొడుకుపైన కూడా గుర్తుతెలీని వ్యక్తులు విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచినట్లు చెప్పారు.
ఇంతకీ అసలు ఏమి జరిగిందంటే చిలుకూరి టెంపుల్(Chilukuru Balaji Temple) కు దగ్గరలోనే ఉన్న మొయినాబాద్ లో ప్రధాన అర్చకుడు తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. మొన్నటి శుక్రవారం రాత్రి దేవాలయంలో పూజాకార్యక్రమాలు ముగిసిన తర్వాత రంగరాజన్ తనింటికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత కొందరు గుర్తుతెలీని వ్యక్తులు వచ్చి తమను తాము రామరాజ్య స్ధాపనకు కృషిచేస్తున్న వాళ్ళుగా పరిచయం చేసుకున్నారు. వారిని రంగరాజన్ ఇంట్లోకి ఆహ్వానించి మాట్లాడారు. అప్పుడు రామరాజ్యస్ధాపనకు సాయంచేయాలని కోరారు. అయితే వాళ్ళ మాటతీరు, ప్రవర్తనతో అనుమానం వచ్చిన రంగరాజన్ సాయంచేయటానికి నిరాకరించారు. అంతేకాకుండా వెంటనే వాళ్ళని ఇంట్లోనుండి బయటకు వెళ్ళమని అడిగారు.
ఆ సమయంలో గుర్తుతెలీని వ్యక్తులకు, రంగరాజన్ కు మాటమాట పెరిగింది. అయితే అక్కడే ఉన్న రంగరాజన్ కొడుకు గట్టిగా మాట్లాడటంతో వచ్చిన వ్యక్తులు సడెన్ గా కొడుకుపై దాడిచేశారు. అడ్డొచ్చిన రంగరాజన్ పైన కూడా దాడిచేసి గాయపరిచి అక్కడినుండి వెళ్ళిపోయారు. వెంటనే విషయం తెలియగానే ఆలయ కమిటీ ఛైర్మనే సౌందర్ రాజన్(Sowndar Rajgan) అక్కడికి చేరుకున్నారు. పరిస్ధితిని గమనించి వివరాలు తెలుసుకుని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. రంగరాజన్ ఫిర్యాదులో చెప్పినట్లుగా పోలీసులు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలోనే దాడిచేసినట్లు గుర్తించారు. రెడ్డితో పాటు మరో 20 మంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.