చిరంజీవి చెబితేనైనా టాలీవుడ్ లో చలనం వచ్చేనా
రేవంత్ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ సందర్భంగా తెలుగు పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కుచిరంజీవి కీలక సూచనలు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై ఆయన చిన్నపాటి కోపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి ‘విశ్వంభర డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానం సందర్భంగా సోమవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డులను సమర్ధవంతంగా అమలు చేసేందుకు అభిప్రాయాలూ, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ ఇండస్ట్రీ పట్టించుకోకపోవడం నిరుత్సాహపరిచే విషయమన్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ సందర్భంగా తెలుగు పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కుచిరంజీవి కీలక సూచనలు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో ఉండటంతో ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనను ముందుకుతీసుకెళ్లే చర్యలు తీసుకోవాలని ట్వీట్ లో కోరారు.
"తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్' తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
కాగా, ఈ ఏడాది జనవరి 31న రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తొలిసారి నిర్వహించిన గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నంది స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగు సినిమా, నాటకం, టెలివిజన్ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు ఇచ్చేవారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని వివాదాలు, విభేదాల కారణంగా ఈ అవార్డులను ఆపేశారు.
అయితే, 2023 ఆగస్టులో కన్నుమూసిన తెలంగాణ విప్లవ గాయకుడికి నివాళులర్పిస్తూ గద్దర్ పేరుతో ఈ అవార్డులను అందజేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై ఆయన మరోసారి గుర్తుచేశారు. సినిమా నిర్మాతలు, నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ అంతా కలిసికట్టుగా కృషి చేయాలని నేను ఆశించాను. కానీ మీ మౌనం నన్ను నిరాశపరిచింది. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం కావడం లేదు. ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని మరోసారి సీఎం కోరారు.