
HCA | 20 నెలల్లో రూ.200 కోట్లు మాయం..!
హెచ్‌సీఏలో జరిగిన అక్రమాల చిట్టాను ఒక్కొక్కటికి వెలికి తీస్తున్న అధికారులు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అక్రమాలతో టాక్ ఆఫ్ ది స్టేట్‌గా నిలుస్తోంది. ‘హెచ్‌సీఏ చేసిన అక్రమాలు రోజుకొకటిగా వెలుగు చూస్తున్నాయి. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లు ఈ అక్రమాలు ఉంటున్నాయి’ అని అధికారులు అంటున్నారు. ఇప్పటికే హెచ్‌సీఏ చేసిన నిధుల దుర్వినియోగంపై అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. వాటిని తేల్చడం కోసం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఇది పూర్తయితే అసలు మొత్తం వచ్చిన నిధులు ఎంత.. అందులో దుర్వినియోగం అయింది ఎంత? అనేది తేల్తుందని సీఐడీకి అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమాలు ఎంత మేరా జరిగాయి? వచ్చిన నిధులు ఎన్ని? ఖర్చు చేసిన మొత్తం ఎంత? ఇలాంటి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే జగన్‌మోహన్.. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ.240కోట్ల నిధులు మంజూరయ్యాయని అధికారులు పరిశీలనలో తేలింది. ఇప్పుడు హెచ్‌సీఏ ఖాతాలో మొత్తం రూ.40 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే 20 నెలల సమయంలో రూ.200 కోట్లు ఖర్చు అయ్యాయి.
అయితే ఆ రూ.200 కోట్లు దేనికి ఖర్చు చేశారు? అనేది తెలుసుకోవడం కోసమే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు సీఐడీ తెలిపింది. 2014 నుంచి ఇప్పటి వరకు హెచ్‌సీఏ అక్రమాలపై రెండుసార్లు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు. ఇప్పుడు సీఐడీ సిఫార్సుతో ముచ్చటగా మూడోసారి చేస్తున్నారు. కాగా నకిలీ బిల్లులు వినియోగించి బీసీసీఐ గ్రాంట్లు, హెచ్‌సీఏ నిధులను నిందితులు కొల్లగొట్టినట్లు నిర్ధారితమైందని సీఐడీ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే మొత్తం ఎంత మేర అక్రమం జరిగింది? ఇందులో ఎవరి పాత్ర ఎంత? అనేది తేల్చడం కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలు అక్రమం ఇదే..
ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ మధ్య కొనసాగిన వివాదం.. సీఎం రేవంత్ చెంతకు చేరింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. విజిలెన్స్ అధికారుల దర్యాప్తుకు ఆదేశించారు. మరుసటి రోజే హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. కానీ హెచ్‌సీఏకు అసలు చిక్కులు అప్పటి నుంచే మొదలయ్యాయి. దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అధికారులు అనేక విషయాలు కనుగొన్నారు. వాటిలో హెచ్‌సీఏ నిధులు దుర్వినియోగం అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ అంశంలోకి సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువా రెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ.. అనేక కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తోంది.
దీంతో పాటుగానే సమ్మర్ క్యాంపుల పేరుతో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అండ్ కో అంతా కలిసి రూ.4కోట్లు దారి మళ్లించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను కూడా సీఐడీ అధికారులు సేకరించినట్లు సమాచారం. గతేడాది సమ్మర్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 కేంద్రాల్లో హెచ్‌సీఏ.. సమ్మర్ క్యాంపులను నిర్వహించింది. ప్రతీ క్యాంపులో 100 మంది చొప్పున మొత్తం అన్ని క్యాంపుల్లో కలిపి 2500 మందికిపైగా ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలను చూపింది హెచ్‌సీఏ. ఒక్కో క్యాంప్‌పై రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి.. రూ.4 కోట్ల రూపాయలు జగన్‌మోహన్‌రావు కాజేశారు. క్యాంప్‌కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్‌లు నిర్వహించిన కేంద్రాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంప్‌లో లక్ష కూడా ఖర్చు చేయలేదని సీఐడీ ఆధారాలు సేకరించింది.