
రౌడీ హీరోను మరోసారి విచారించిన సిట్
విజయ్ దేవరకొండను వదలని బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారం.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో రౌడీ హీరో విజయ్ దేవరకొండను సిట్ అధికారులు మరోసారి విచారించారు. గతంలో ఒకసారి ఇదే అంశంపై విచారించిన అధికారులు మంగళవారం దాదాపు గంటపాటు విచారించారు. పలు అంశాలపై ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు తీసుకున్న పారితోషికం, మీషన్లపై ఆరా వంటి వివరాలను అడిగినట్లు సమాచారం. విచారణ పూర్తయిన వెంటనే సీఐడీ సిట్ కార్యాలయం వెనకగేటు నుంచి విజయ్ వెళ్లిపోయారు. కాగా ఇదే కేసులో విచారణకు రావాలని నటుడు ప్రకాష్ రాజ్‌కు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే గతంలో విజయ్ దేవరకొండను విచారించినప్పుడు.. అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు తాను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్సే కాదన్నాడు. తాను గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని, అవి ఇండియాలో లీగల్‌వేనని చెప్పారు.
గతంలో విజయ్ ఏమన్నాడంటే..
‘‘బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కు ఏమాత్రం సంబంధం ఉండదు. అనేక రాష్ట్రాల్లో గేమింగ్ యాప్స్ చట్టబద్దమైనవే. వీటికి జీఎస్టీ, ట్యాక్స్ సహా అన్ని అనుమతులు ఉంటాయి. రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఐపీఎల్, కబాడీ, వాలీబాల్‌కి స్పాన్సర్ చేస్తున్నారు. అదే విధంగా యాప్స్‌కు ప్రమోషన్, స్పాన్సరింగ్ ఉంటుంది. వీటితో పాటు నా బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలను కూడా అధికారులకు అందించాను. నేను ప్రమోట్ చేసిన A23 అనే యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు. నేను లీగల్‌గా ఉన్న గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశాను’’ అని విజయ్ వివరించారు.
అసలు కేసు ఏంటంటే..
బెట్టింగ్ వ్యవసం వల్ల అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్‌పై ఉక్కుపోదం మోపాలని తెలంగాణ పోలీసులు నిశ్చయించుకున్నారు. ఇందులో బాగంగానే వీటిని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, నటీనటులపై కేసులు నమోదు చేశారు. ఇందులో అనేక మంది బడాబడా హీరోలు కూడా ఉన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ కేసులోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. బెట్టింగ్ పేరిట భారీ మనీలాండరింగ్ ఏమైనా జరుగుతుందా అన్న కోణంలో ఈడీ విచాణను ముందుకు సాగిస్తోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలను ఒకరి తర్వాత ఒకరుగా విచారిస్తోంది. వారి నుంచి కాంట్రాక్ట్‌లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వంటి సమాచారాన్ని సేకరిస్తోంది.

