
ఫిలింనగర్
సినీ మాయా ప్రపంచం,ఫిలింనగర్ భూములు అన్యాక్రాంతం
సినీ పరిశ్రమాభివృద్ధి కోసం చౌకగా ప్రభుత్వ స్థలాలను ఫిలింనగర్ సొసైటీకి కేటాయించగా, అవి కాస్తా అన్యాక్రాంతమయ్యాయి. పార్కులు, రోడ్డు స్థలాలు కబ్జా అయ్యాయి.
ఫిలింనగర్‌లో సినిమా పరిశ్రమకు సంబంధం లేని అనర్హుల చేతుల్లోకి ప్లాట్లు మారడమే కాదు అడుగడుగునా ఆక్రమణలు జరిగాయి. ఫిలింనగర్ లో పార్కు స్థలాలు, రోడ్ల స్థలాలు కూడా కబ్జా పాలయ్యాయని జిల్లా సహకార శాఖ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. సినీ దర్శకుడు జంధ్యాలకు ఫిలింనగర్ లో 75 బి ప్లాట్ కేటాయించారు. ఈ ప్లాటు సినీ పరిశ్రమకు సంబంధం లేని డాక్టర్ సి వెంకటరమణారెడ్డికి బదలాయించారు. సదరు డాక్టర్ వెంకటరమణారెడ్డి ఈ ప్లాటు కొని పక్కన ఉన్న పార్కు స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించుకొని ఇల్లు నిర్మించారని దర్యాప్తులో తేలింది.
లే అవుట్ లో ఉన్న రోడ్డు కబ్జా
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు 54వ నంబరు ప్లాటు, జీఎస్ఆర్ కృష్ణమూర్తికి 55 నంబరు ప్లాట్ కేటాయించారు. 54వ నంబరు ప్లాటును ఆదిశేషగిరిరావు సినీపరిశ్రమకు సంబంధం లేని జి పద్మావతిదేవికి బదలాయించారు.55వ నంబరు ప్లాటును కృష్ణమూర్తి గల్లా అశోక్ పేరిట బదలాయించారు. 54,55 ప్లాట్ల మధ్యలో రోడ్డు ఉన్నట్లు లేఅవుట్ లో ఉండగా, ఈ రోడ్డు స్థలాన్ని కూడా ఆక్రమించి భవనం నిర్మించారు. ఎస్ నవకాంత్ కు కేటాయించిన 61 వనంబరు ప్లాటును రెండుగా విభజించి క్రీడాకారిణి సానియా మీర్జా, ఎమ్మెల్సీ యావవరెడ్డి కొనుగోలు చేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి తన ప్లాట్ పక్కన ఉన్న పార్కు స్థలాన్ని కబ్జా చేశారని దర్యాప్తులో తేలింది.
నెరవేరని లక్ష్యం
మద్రాస్ నుంచి సినీపరిశ్రమను హైదరాబాద్ నగరానికి తరలింపు పేరిట ప్రభుత్వ స్థలాలను ఫిలింనగర్ లో కారుచౌకగా ప్రభుత్వం కేటాయించగా, ఆ భూములు కాస్తా అన్యాక్రాంత మయ్యాయి. ప్రస్థుత మార్కెట్ ధర ప్రకారం ఫిలింనగర్ లో ఎకరం భూమి విలువ వందకోట్ల రూపాయలుండగా, గతంలో ప్రభుత్వం ఎకరం 8,500 రూపాయలకే ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీకి అప్పగించింది. ఈ విలువైన స్థలాలను సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖులే అనర్హులైన వారి కుటుంబసభ్యుల పేరిట కొనుగోల్ మాల్ చేశారు. సొసైటీ నిబంధనలను ఉల్లంఘించి కొందరు బడా వ్యక్తులే ఫిలింనగర్ ప్లాట్లను వారి కుటుంబసభ్యుల పేరిట దక్కించుకున్నారు.
ఫిలింనగర్ లో బడా వ్యక్తుల పాగా
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా వ్యాపారులు, సినీ పరిశ్రమతో సంబంధం లేని వారు ఫిలింనగర్ ప్లాట్లను దక్కించుకున్నారు.ప్రభుత్వం సినీ పరిశ్రమాభివృద్ధి కోసం విలువైన ప్రభుత్వ భూములను సొసైటీకి కేటాయించగా, ఆ స్థలాలు అనర్హులైన, సినీ పరిశ్రమతో సంబంధం లేని వారి పరమయ్యాయి. దీంతో ఫిలింనగర్ లో సినిమా పరిశ్రమలోని వారి కంటే ఇతరులే ఎక్కువగా ఉన్నారు. ఫిలింనగర్ సొసైటీ బైలాస్ ను ఉల్లంఘించి సినీ పరిశ్రమతో సంబంధం లేని బడా వ్యక్తులు భూములను దక్కించుకున్నారని సహకార శాఖ, విజిలెన్స్ విచారణలో తేలింది.
బడా బాబుల చేతుల్లో ఫిలింనగర్ ప్లాట్లు
ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ప్రముఖ నటుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, జయభేరి నిర్మాణ సంస్థ అధిపతి మాగంటి మురళీ మోహన్ లాంటి బడా వ్యక్తులే అనర్హులైన వారి కుటుంబ సభ్యుల పేరిట ఫిలింనగర్ ప్లాట్లను దక్కించుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఫిలింనగర్ ప్రధాన రహదారిపై ఉన్న ఫిలింనగర్ 1వ నంబరు ప్లాట్ ను డి సీతారామ శాస్త్రికి కేటాయించగా, దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారి, భవ్య సిమెంట్స్ అధినేత ఎస్వీ ఆనందప్రసాద్ దక్కించుకున్నారు. 1వ నంబరు ప్లాట్ నే అనర్హుడి పరమైంది. ప్రముఖ సినీనటి మాధవికి కేటాయించిన 2వ నంబరు ప్లాట్ ను సురేష్ బాబు కాస్మో గ్రానైట్ ప్రవేటు లిమిటెడ్ పేరిట కొన్నారు.ప్లాట్ నంబరు 3ని దగ్గుబాటి వెంకటేష్ కు కేటాయించగా దాన్ని కాస్మో గ్రైనైట్ కు అప్పగించారు.
గెస్ట్ హౌస్ ల నిర్మాణం
ప్రముఖ దర్శకుడు టి త్రివిక్రమరావుకు 4వ నంబరు ప్లాట్ కేటాయించగాఅది కాస్తా రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నే శ్రినివాసరావు చేతుల్లోకి మారింది. జి వెంకటేశ్వరరావుకు అలాట్ అయిన 5వ నంబరు ప్లాట్ డీబీసీ మోటార్స్ కంపెనీ పరమైంది. ఎం వెంకటేశ్వరరావు కు కేటాయించిన 7వ నంబరు ప్లాటులో వాణిజ్య భవనం నిర్మించి కుమార్తెకు అద్దెకు ఇచ్చాడు. డి నర్సింహ రాజుకు కేటాయించిన ప్లాట్ దక్కన్ ఇండియా చేతుల్లోకి మారింది. 24వ నంబరు ప్లాట్ ను డి సురేష్ బాబుకు కేటాయించగా, పక్కన 23 వ నంబరు ప్లాట్ ను కొని రెండు కలిపి గెస్టు హౌస్ నిర్మించారు.
చిరంజీవి కుటుంబసభ్యుల పేరిట ప్లాట్ల కొనుగోలు
సినీ పరిశ్రమకు చెందిన యూ సూర్యనారాయణ బాబుకు కేటాయించిన 25 నంబరు ప్లాటును చిరంజీవి కొని తన పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత పేరిట రిజిస్టర్ చేయించారు. పి శశిభూషణ్ కు కేటాయించిన 27వ నంబరు ప్లాట్ ను చిరంజీవి తన భార్య కొణిదెల సురేఖ పేరిట కొని, అందులో కేవీఆర్ డయాగ్నస్టిక్ సెంటరు ఏర్పాటు చేశారు.ప్లాట్ నంబరు 35 ఎ, 35 బి లను జనప్రియ రియల్ ఎస్టేట్ యజమానులు సొంతం చేసుకున్నారు. బి సత్య సీతారామరాజు కు కేటాయించిన 7 వనంబరు ప్లాటును హాస్యనటుడు అల్లు రామలింగయ్య తన భార్య అల్లు కనకరత్నం పేరిట కొనుగోలు చేశారు. పి సరోజా ప్లాటును జర్నలిస్ట్ కె శశికళ దక్కించుకున్నారు. 10,12 ప్లాట్లను ఉషా కిరణ్ మూవీస్ సంస్థ కొనుగోలు చేసింది. అనర్హులు, బడా వ్యక్తులు, బడా వ్యాపారులు ఫిలింనగర్ ప్లాట్లను దక్కించుకున్నారని తేలింది. అనర్హుల వద్ద నుంచి ఫిలింనగర్ ప్లాట్లను స్వాధీనం చేసుకొని వాటిని వేలం ద్వారా విక్రయించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Next Story