
‘న్యాయవ్యవస్థ ముందు అనేక సవాళ్లున్నాయి’
విదేశీ డిగ్రీల వల్ల మన టాలెంట్ పెరుగుతుందని అనుకోవడం తప్పు. మన టాలెంట్ మన పనితనంతో నిరూపించుకోవాలి.
భారత న్యాయవ్యవస్థ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, వాటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని సీజేఐ జస్గిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. న్యాయ రంగంలోకి వస్తున్న విద్యార్థులు వీటిని దృష్టిలో పెట్టుకోవాలని, సవాళ్లకు బెదిరిపోకుండా ఎదుర్కోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో జరుగుతున్న 22వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే న్యాయరంగంలోని సవాళ్ల గురించి ప్రస్తావించారు. అదే విధంగా యువ న్యాయవాదులు, న్యాయరంగ విద్యార్థులకు కీలక సూచనలు కూడా చేశారు. ప్రస్తుతం భారతదేశం అనేక లీగల్ సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. ఇలాంటి సమయంలో న్యాయవాదులు, న్యాయ సేవలో ఉన్నవారంతా కూడా ఎవరు ఏం చెబుతున్నారు అన్న అంశాలను అత్యంత సునిశితంగా, క్షుణ్ణంగా పరిశీలిస్తుండాలని, అదిచాలా ముఖ్యమని వివరించారు బీఆర్ గవాయ్.
అదే విధంగా న్యాయ రంగంలోకి కృత్రిమ మేధస్సు ఆగమనానికి సమయం ఆసన్నమైందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐని సరైన రీతిలో వినియోగించుకుంటే తీర్పులను వేగంగా ఇవ్వడం సాధ్యమవుతోందని ఆయన అన్నారు. ‘‘మన దేశంలో నాణ్యమైన న్యాయ విద్య ఉంది. విదేశీ డిగ్రీల వల్ల మన టాలెంట్ పెరుగుతుందని అనుకోవడం తప్పు. మన టాలెంట్ మన పనితనంతో నిరూపించుకోవాలి. ఫారిన్ డిగ్రీల కోసమే కుటుంబాలను అప్పులు పాలు చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘మనం ఏ పని చేస్తున్నా.. అది ఎంత మనసు పెట్టి చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. న్యాయ రంగంలో విశ్వాసం, నిబద్దత, ప్రజల సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని తెలిపారు.