మూసీ నది ప్రక్షాళన పనులు విఫలం,కోట్లాది రూపాయలు వ్యర్థం
x

మూసీ నది ప్రక్షాళన పనులు విఫలం,కోట్లాది రూపాయలు వ్యర్థం

హైదరాబాద్‌ నడిబొడ్డున పారుతూ ప్రజలకు దుర్గంధాన్ని పంచుతున్న మూసీనదిని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించినా అవి వ్యర్థమయ్యాయి..


హైదరాబాద్ నగరం మధ్యలో పారుతున్న మూసీ నదీ ప్రక్షాళన కోసం వెచ్చించిన నిధులు వృథాగా మారడంతో దుర్గంధం వెలువడుతూనే ఉంది. మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టిన పనులు విఫలం అయిన వైనంపై హైదరాబాద్ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా సర్వే చేసింది. మూసీ ప్రక్షాళన పనుల వైఫల్యాలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పరిశీలనలో తేలిన నిజాలను ‘ఫెడరల్ తెలంగాణ’ మీ ముందుంచుతుంది.


రూ.405 కోట్లు వృథా
మూసీ నది ప్రక్షాళన కోసం 2001వ సంవత్సరంలో నేషనల్ కన్జర్వేషన్ ప్రాజెక్టు కింద కేంద్రప్రభుత్వం 70శాతం వాటాగా 344 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు కేటాయించింది. 405 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన పనులు చేపట్టారు.ఈ నిధులతో మూసీలో కలుషిత, మురుగు నీటిని ట్రీట్ మెంట్ చేసి శుద్ధి చేసిన నీటిని మూసీలో వదిలేందుకు వీలుగా సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్లను నిర్మించింది.

ఎస్టీపీలు విఫలం
మూసీ నదిలో కలుషిత నీటి నివారణ కోసం నిజాం హయాంలో అంబర్ పేట వద్ద ఏర్పాటు చేసిన సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్ ఇప్పటికీ బాగా పనిచేస్తుందని ఫోరం పరిశీలనలో తేలింది. ఆ తర్వాత నిర్మించిన సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్లు సజావుగా పనిచేయడం లేదు. దీంతో కలుషిత జలాలు మూసీలో ప్రవహిస్తూనే ఉన్నాయి.

రూ.40 కోట్లతో మూసీలో రబ్బరు డ్యాం నిర్మాణం
మూసీ నదిలో హైకోర్టు భవనం వద్ద చెత్త చెదారం రాకుండా నివారించేందుకు వీలుగా రూ.40 కోట్లతో రబ్బరు డ్యాంను నిర్మించారు. ఈ రబ్బరు డ్యాం వద్ద చెత్త పేరుకుపోయి దోమలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. దీంతో రూ.40కోట్లతో నిర్మించిన రబ్బరు డ్యాంను తొలగించారు. దీంతో మూసీ ప్రక్షాళన నిధులు మరోసారి వృథాగా మారాయి.

2011లోనూ రూ.3వేల కోట్లతో మళ్లీ ప్రతిపాదనలు
మూసీ ప్రక్షాళనకు 500కోట్ల రూపాయలు వెచ్చించినా, ఆ నిధులు వృథాగా మారాయి తప్ప మూసీ ప్రక్షాళన జరగలేదు. దీంతో మళ్లీ మరో 3వేల కోట్ల రూపాయలతో మరోసారి మూసీ ప్రక్షాళన ప్రతిపాదనలు రూపొందించారు. మూసీ ప్రక్షాళన కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు రూ.800కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.700కోట్లు, హెచ్ఎండీఏకు రూ.1500కోట్లు కేటాయించాలని ప్రతిపాదించినా, గతంలో కేటాయించిన నిధులు వృథా అయ్యాయని కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు నిరాకరించింది.

మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్
2021వ సంవత్సరంలో మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా మూసీ ప్రక్షాళన కోసం ఎలాంటి పనులు చేపట్టలేదు. మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా సుధీర్ రెడ్డిని నియమించినా ప్రక్షాళన పనులు మాత్రం చేపట్టలేదు.

మరోసారి తెరపై మూసీ నది ప్రక్షాళన
తెలంగాణలో ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన పనులను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. దీని కోసం బడ్జెట్ లో మూడువేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్రంతో పాటు విదేశీ సంస్థల సహకారంతో మూసీ నదిని థెన్స్ నది తరహాలో శుద్ధి చేసి అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

మూసీలో కలుషిత జలాలు రాకుండా నివారించండి : యం పద్మనాభరెడ్డి
మూసీ నదిలో ఫ్యాక్టరీల నుంచి వచ్చే కలుషిత జలాలు రాకుండా నివారించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి సూచించారు. మూసి తీరంలో 12 పారిశ్రామికవాడల నుంచి కలుషిత నీరు వచ్చి కలుస్తుంది. కాలుష్యకారక పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించి కలుషిత జలాలు మూసీలోకి రాకుండా చేయాల్సింది పోయి ఎస్టీపీల నిర్మాణం పేరిట ప్రభుత్వం నిధులు వృథా చేస్తుందని పద్మనాభరెడ్డి చెప్పారు. మురుగునీరు మూసీలో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


Read More
Next Story