మసకబారుతున్న తెలంగాణ మామిడి వైభవం
x
తెలంగాణలో మామిడి తోట : తగ్గిన దిగుబడి

మసకబారుతున్న తెలంగాణ మామిడి వైభవం

తెలంగాణలో మంచి మామిడి పండ్ల సీజన్‌ని మర్చిపోవాల్సిందేనా?


తెలంగాణలో (Telangana)ఈ ఏడాది తీపి ఫలాలు పండించిన మామిడి రైతులకు ‘చేదు’ఫలాలు మిగిలాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం, పొగమంచు, తామర పురుగు పోటు, అకాలవర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో మామిడి దిగుబడి తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, మహబూబాబాద్, వరంగల్, ములుగు, హన్మకొండ, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మామిడి తోటలను రైతులు సాగుచేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 3.24 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేయగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ ఏడాది మామిడి దిగుబడి (Mango Production)గణనీయంగా తగ్గింది. పెరిగిన ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, గాలిదుమారం,మామిడి తోటలపై పురుగుల పోటు వల్ల 20శాతం దాకా దిగుబడి తగ్గి తాము తీవ్రంగా నష్టపోయామని నల్గొండ జిల్లాకు చెందని గంజి మారయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.




2018 నుంచి తగ్గుతున్న మామిడి దిగుబడి

తెలంగాణలో 2015వ సంవత్సరంలో మామిడి దిగుబడి రికార్డు స్థాయిలో 1,801.748 టన్నులు వచ్చింది. అత్యల్పంగా 2017వ సంవత్సరంలో 482.458 టన్నులే దిగుబడి వచ్చింది.2018 వ సంవత్సరం నుంచి 2024 వరకు సగటున 1,148.996 టన్నుల మామిడి దిగుబడి వచినట్లు తెలంగాణ హార్టికల్చర్ అధికారులు చెప్పారు. 2017 దాకా మామిడి అధిక దిగుబడులు వచ్చినా ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. గత ఏడేళ్లుగా మామిడి దిగుబడులు తగ్గుతున్నాయి.వాతావరణ పరిస్థితులే కాకుండా మామిడి తోటల సాగు తగ్గడంతోపాటు (Mango Crop Declines)ఆయిల్ ఫాం సాగు పట్ల రైతులు మొగ్గు చూపుతుండటం కూడా ఒక కారణమని హార్టికల్చర్ అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 2024వ సంవత్సరంలో 1114.112 మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వచ్చిందని హార్టికల్చర్ అధికారులు చెప్పారు. అయితే ఈ ఏడాది గత ఏడాది కంటే మామిడి దిగుబడి పది నుంచి 20 శాతం దాకా తగ్గే అవకాశం ఉందని హార్టికల్చర్ అధికారి కందగట్ల సందీప్ చెప్పారు. మే నెలాఖరులో కల్లా ఈ ఏడాది మామిడి దిగుబడి ఎన్ని టన్నులకు తగ్గిందనే వాస్తవ అంకెలు వస్తాయని హార్టికల్చర్ అధికారులు చెప్పారు.



కొల్లాపూర్ మామిడికి జీఐ ట్యాగ్

తెలంగాణ రాష్ట్రంలోనే కొల్లాపూర్ మామిడికి ప్రత్యేక గుర్తింపు ఉంది.అత్యంత తీపితోపాటు అత్యధిక దిగుబడి, పెద్ద సైజు బేనీషా కొల్లాపూర్ మామిడికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించనుంది.దీంతో కొల్లాపూర్ మామిడికి దేశ విదేశాల్లో డిమాండ్ ఉంది. మామిడి తోటల కౌలు, ఎరువులు,పురుగుమందులు, కూలీల ఖర్చులు పెరగడంతోపాటు మామిడి దిగుబడి తగ్గడం వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వాతావరణంలో వ్యత్యాసాలు, తేనే మంచు ప్రభావం వల్ల పూత పిందెగా మారడం తగ్గిందని ఖమ్మం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కందగట్ల సందీప్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తగ్గిన మామిడి దిగుబడి
కొల్లాపూర్ మామిడి సాధారణంగా ఎకరానికి 90 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో (Climate Change) మామిడి చెట్లకు పూత ఆలస్యంగా వచ్చింది. వచ్చిన పూత చీడ పీడల బెడదతో రాలిపోయిందని తెలంగాణ ఉద్యానవన శాఖ మాజీ డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మామిడి తోటలకు ఉష్ణోగ్రతలు 25 నుంచి 32 డిగ్రీల సెల్షియస్ లోపు ఉండాలి. అయితే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల నమోదుతో మామిడి కాయల దిగుబడి గణనీయంగా తగ్గిందని ఆయన చెప్పారు.పొగమంచు ప్రభావం, తామర పురుగు ప్రభావంతో మామిడి పూత రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని వెంకట్రామిరెడ్డి వివరించారు.ఈ ఏడాది ఎకరానికి మామిడి దిగుబడి 40 మెట్రిక్ టన్నులకు తగ్గిందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.



కొల్లాపూర్‌లో నేలరాలిన మామిడికాయలు

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో 23,789 ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. జీఐ ట్యాగ్ వల్ల కొల్లాపర్ మామిడికి మంచి ధర వస్తుందని ఆశించిన రైతులకు ప్రకృతి వైపరీత్యాలు నిరాశ మిగిల్చాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ల్ల మామిడికాయలు నేలరాలాయి.అసలే వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో మామిడి పండ్ల దిగుబడి తగ్గిందని, దీనికితోడు గాలుల ప్రభావంతో మామిడి కాయలు నేలరాలి తాము తీవ్రంగా నష్టపోయామని కొల్లాపూర్ మామిడి రైతు కర్రా హరీష్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.గాలుల ప్రభావంతో టన్నుల కొద్దీ మామిడికాయలు నేల రాలి నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కొల్లాపూర్ ప్రాంత బీఆర్ఎస్ నాయకుడు రంగినేని అభిలాషరావు డిమాండ్ చేశారు.

మధ్య దళారుల దగా
మామిడి దిగుబడి తగ్గిపోయి నష్టపోయిన రైతులకు దళారుల బెడద వల్ల వారికి సరైన ధర రావడం లేదు. బహిరంగ మార్కెట్ లో మామిడి పండ్లు కిలో ధర 100 రూపాయల నుంచి 150 రూపాయల దాకా పలుకుతున్నా బాటసింగారం మార్కెట్ లో 30 రూపాయలు దాటడం లేదని మామిడి రైతు ఎం మల్లయ్య ఆవేదనగా చెప్పారు. మధ్య దళారులు తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దళారులు, వ్యాపారులు రింగుగా ఏర్పడి మార్కెట్ కు మామిడి కాయలు తెచ్చిన రైతులకు సరైన ధర ఇవ్వడం లేదు. దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొని లాభాలు గడిస్తుండగా ఆరుగాలం కష్టించి పండించిన మామిడి రైతులు నష్టాలే మిగులుతున్నాయి. బంగినపల్లి, దసేరి, హిమాయత్, తోతాపురి రకాల మామిడికాయలను రైతులు పండిస్తున్నారు.



ఫ్రూట్ బ్యాగింగ్ విధానంతో మామిడి పండ్ల ఎగుమతి

కొందరు రైతులు ఫ్రూట్ బ్యాగింగ్ విధానంతో నాణ్యత గల మామిడి పండ్ల దిగుబడితో ఎగుమతి చేసేందుకు సమాయత్తం అయ్యారు.ఎగుమతికి కోసం మామిడి కాయ నాణ్యతగా మచ్చలు లేకుండా మంచి కలరులో పెరిగేలా చేసేందుకు మామిడి పండ్లకు బ్యాగులు తోడుగుతారు. దీన్నే ఫ్రూట్ బ్యాగింగ్ విధానం అని చెబుతున్నారు.సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనకున్న ఆరు ఎకరాల మామిడి తోటల్లో ఫ్రూట్ బ్యాగింగ్ విధానం చేపట్టారు. రాష్ట్రంలో మామిడి పండ్లకు ధర రాక పోవడం వల్ల ఫ్రూట్ బ్యాగింగ్ విధానంతో నాణ్యమైన మామిడి పండ్లను పండించి వాటిని ఈ ఏడాది విదేశాలకు ఎగుమతి చేస్తున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మామిడి చెట్లను కొట్తేస్తున్న రైతులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మామిడి తోటలను రైతులు కొట్టేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం వేసిన మామిడి తోటల్లో పండ్ల దిగుబడి తగ్గడంతో పాటు మార్కెట్ లో దళారుల రాజ్యం వల్ల సరైన ధర రాకపోవడంతో రైతులు మామిడి తోటలను తీసేస్తున్నారు.ఆయిల్ ఫాంకు మార్కెట్ లో దళారుల ప్రమేయం లేకుండా మంచి ధర లభిస్తుండటంతో రైతులు మామిడి తోటలను నరికేసి వాటి స్థానంలో ఆయిల్ ఫాం తోటలు వేస్తున్నారని సత్తుపల్లి ప్రాంత హార్టికల్చర్ అధికారి కందగట్ల సందీప్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తెలంగాణలో తగ్గిన మామిడి దిగుబడి
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం వల్ల మామిడి దిగుబడి తగ్గిందని హార్టికల్చర్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ డి రాజిరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు పూత దశలో రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గిందని తమ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జరిపిన ఫీల్ట్ సర్వేలో తేలిందని ఆయన తెలిపారు.

బాటసింగారంలో మామిడి పండ్ల సందడి
రైతుల పరిస్థితి ఇలా ఉన్నా బాట సింగారం మార్కెట్ మాత్రం మామిడి పళ్లతో కళకళలాడుతోంది. హైదరాబాద్ నగర శివార్లలోని బాటసింగారం మార్కెట్ లో మామిడి పండ్ల లారీల సందడి మొదలైంది. గత ఏడాది ఏప్రిల్ 25వతేదీ వరకు 42 వేల మెట్రిక్ టన్నుల మామిడి రాగా, ఈ ఏడాది 44వేల టన్నుల మామిడి పండ్లు వచ్చాయని బాటసింగారం మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఎల్ శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. శుక్రవారం బాటసింగారం మార్కెట్ లో బంగినపల్లి మామిడిపండ్లధర 30 రూపాయల దాకా పలికింది. దసేరి రకం మామిడి 64 రూపాయలు, హిమాయత్ రకం మామిడి ధర వందరూపాయలకు చేరుకుంది. తెలంగాణలో పండిన మామిడి దిగుబడిలో 10 శాతం మాత్రమే బాటసింగారం మార్కెట్ కు వస్తుందని, మిగతా మామిడిపండ్లు ఎగుమతులు, స్థానికంగానే విక్రయిస్తుంటారని మార్కెట్ కార్యదర్శి ఎల్ శ్రీనివాస్ వివరించారు.


Read More
Next Story