కనిమొళి-కవిత జీవితాల్లో ఇన్ని దగ్గరి పోలికలున్నాయా ?
x
Kanimozhi and kavita

కనిమొళి-కవిత జీవితాల్లో ఇన్ని దగ్గరి పోలికలున్నాయా ?

అప్పట్లో కనిమొళికి ఏదైతే జరిగిందో ఇపుడు కవితకు కూడా అలాగే జరుగుతోందనే చర్చ పార్టీల మధ్యే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెరిగిపోతోంది.


ఇపుడిదే విషయమై రాజకీయవర్గాల్లో బాగా చర్చలు జరుగుతున్నాయి. అప్పట్లో కనిమొళికి ఏదైతే జరిగిందో ఇపుడు కవితకు కూడా అలాగే జరుగుతోందనే చర్చ పార్టీల మధ్యే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెరిగిపోతోంది. ఇద్దరి మధ్యా కామన్ పోలికలు ఏమిటంటే ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్ళు, తమ పార్టీల్లో యాక్టివ్ గా ఉంటారు, ఇద్దరూ ప్రజాప్రతినిధులే, ఇద్దరూ ఆరోపణలను ఎదుర్కొని జైలుకు వెళ్ళిన వాళ్ళే. ఇంతటి దగ్గరి పోలికలు ఉండటంతోనే ఇద్దరి జీవితాలపైనా బాగా చర్చ జరుగుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కల్వకుంట్ల కవిత 166 రోజుల జైలు జీవితం గడిపి బెయిల్ పైన మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూపు తరపున కవితకు కోట్లరూపాయలు ముడుపులు ముట్టిందని ఈడీ, సీబీఐలు ఆరోపించాయి. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను, సాక్ష్యాలను బెదిరిస్తారని, కేసు దర్యాప్తును నీరుగారుస్తారని దర్యాప్తు సంస్ధలు గట్టిగా వాదించాయి. ఇలాంటి వాదనలతో కవితను దర్యాప్తు సంస్ధలు 166 రోజులు తీహార్ జైలులోనే ఉంచగలిగాయి. బెయిల్ కోసం కవిత వేసిన చాలా పిటీషన్లను కోర్టులు తిరస్కరించాయి. చివరకు బెయిల్ కేసును విచారించిన సుప్రింకోర్టు కవితకు బెయిల్ గ్రాంట్ చేసింది. దాంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భర్త అనీల్ రావు, సోదరుడు కల్వకుంట్ల తారకరామారావు, బావ హరీష్ రావు తదితరులతో కలిసి విమానంలో కవిత హైదరాబాద్ చేరుకుంటున్నారు.

సీన్ కట్ చేస్తే అంటే 2011, డిసెంబర్ 3వ తేదీన ఏమి జరిగిందో చూద్దాం. డిసెంబర్ 3వ తేదీన 193 రోజులు తీహార్ జైలులో గడిపిన కనిమొజి ఢిల్లీలో బయలుదేరి చెన్నైకి చేరుకున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో కనిమొళి కీలకపాత్రదారిగా అప్పట్లో కూడా సీబీఐ తీవ్రమైన ఆరోపణలు చేసింది. లైసెన్సులకు సంబంధించిన వ్యవహారంలో కళైంజ్ఞర్ టీవీకి సంబంధించిన డీబీ గ్రూపు నుండి కళిమొని రు. 200 కోట్లు ముడుపులు తీసుకున్నారన్నది దర్యాప్తు సంస్ధ ఆరోపణ. కళైంజ్ఞర్ టివీలో కనిమొళి ఒక డైరెక్టర్. అలాగే అప్పటి టెలికమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రాజా తరపున కనిమొళి డీబీ గ్రూపు నుండి కోట్లరూపాయలు వసూలు చేశారని సీబీఐ ఆరోపించి 2011, మేనెల 20వ తేదీన అరెస్టుచేసింది. అప్పటినుండి 193 రోజులు ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు.

తనపైన సీబీఐ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, రాజకీయ కక్షతోనే కేసులు పెట్టి ఇరికించారని మొత్తుకున్న కనిమొళి తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులను అభ్యర్ధించారు. అయితే చాలాసార్లు ఆమె పిటీషన్లను తిరస్కరించిన తర్వాత చివరగా ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరుచేసింది. అప్పటికే కనిమొళి ఎంపీగా ఉంటూనే డీఎంకే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కరుణానిధి ముద్దుల కూతురు కూడా కావటంతో పార్టీలో కాని ప్రభుత్వంలో కాని కనిమొళి చెప్పింది చెప్పినట్లే జరిగేది. దాంతో ‘చెన్నై సంఘం’ అనే సాంస్కృతిక సంఘాన్ని ఏర్పాటుచేసి దాని ఆధ్వర్యంలో తమిళనాడులో ముఖ్యంగా పొంగల్ పండుగ(మన దగ్గర సంక్రాంతి)ను ఘనంగా నిర్వహించేవారు. చెన్నై సంఘం కార్యక్రమాల ద్వారా మహిళల్లో బాగా చొచ్చుకుపోయారు. రాజకీయంగా ఎంత పవర్ ఫుల్ అయినా, రాజ్యసభ ఎంపీగా ఉన్నా కూడా చివరకు 193 రోజుల జైలు జీవితం తప్పలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే కీలక భాగస్వామిగా ఉన్నా అదే పార్టీకి చెందిన కనిమొళి మీద కేసులు, విచారణ, అరెస్టు, జైలు జీవితం తప్పలేదు. విచిత్రం ఏమిటంటే యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 జీ స్పెక్ట్రమ్ కేసు పూర్తిగా ఊహాజనితమని, అసలు స్కామే జరగలేదని సుప్రింకోర్టు తేల్చేసింది. స్కామ్ జరగలేదని, ఊహాజనితమని తేలిపోవటం బాగానే ఉంది మరి ఏ తప్పు చేయని కనిమొళి అరెస్టయి 193 రోజుల జైలు జీవితం గడిపిన కారణంగా జరిగిన ఇమేజి డ్యామేజీ మాటేమిటి ? అప్పటి కనిమొళి, ఇప్పటి కవితల జీవితాలను చూస్తే చాల దగ్గరి పోలికలున్నట్లు బోధపడుతుంది.

చాలా దగ్గరి పోలికలు

అక్కడ కనిమొళి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు అయితే ఇక్కడ కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు. తమిళనాడులో కనిమొళి చెన్నై సంఘం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఇక్కడ కవిత జాగృతి సంస్ధ ద్వారా బతుకమ్మ పండుగను పాపులర్ చేశారు. అరెస్టయ్యేనాటికి అక్కడ కనిమొళి రాజ్యసభ ఎంపీ అయితే ఇక్కడ కవిత ఎంఎల్సీ. 193 రోజుల తర్వాత బెయిల్ పైన కనిమొళి విడుదలైతే ఇక్కడ కవిత 166 రోజుల తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. కనిమొళి విడుదల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారిన నేపధ్యంలో అసలు 2జీ స్పెక్ట్రమ్ కేసే ఊహాజనితమని కాబట్టి అవినీతి, ముడుపులు లేనేలేవని సుప్రింకోర్టు కేసు కొట్టేసింది. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపైన కోర్టు ఏమంటుంది ?

Read More
Next Story