
సీఎంకు కనీస మానవత్వం ఉండాలే: బండి సంజయ్
తమ భూములను అమ్మొద్దని అడినందుకు విద్యార్థి సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేసి.. స్టేషన్‌లో కొట్టారని బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్ సెంట్ర యూనివర్సిటీ వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనాయాంశంగా మారింది. ఆదివారం కంచ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు చేపట్టిన చదును పనులను అడ్డుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలపై కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి కనీసం మానవత్సం ఉండాలని అన్నారు. ఆడపిల్లలను మెడలు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూస్తుంటే మనసు తరుక్కు పోయిందన్నారు. బీజేపీ కార్యాలయంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. హెచ్‌సీయూలో ఆదివారం కనిపించిన దృశ్యాలను చూసి తెలంగాణ సమాజం బాధపడుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని, వర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని కోరారు.
‘‘తెలంగాణ సమాజం బాధపడుతోంది. సీఎంకు కనీస మానవత్వం ఉండాలి. తమ భూములను అమ్మొద్దంటూ విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల గడవాలి అంటే హెచ్‌సీయూ భూములు అమ్మాలి. భూములు అమ్మకుంటే ప్రభుత్వ పాలన ముందుకు సాగదు. చతికిలబడుతుంది. తమ భూములను అమ్మొద్దని అడినందుకు విద్యార్థి సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేసి.. స్టేషన్‌లో కొట్టారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ అరాచకం చేస్తోంది. విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ఇంత అరాచకం జరుగుతుంటే విద్య కమిషన్ ఏం చేస్తోంది. నోరెందుకు విప్పడం లేదు. అర్బన్ నక్సలైట్‌లతో నింపారు. ప్రజా సమస్యలపైన, మావోయిస్టు భావజాలం ఉన్న మీరు ఎందుకు మాట్లాడట్లేదు. వాళ్లకు కూడా వాటా, కమిషన్ వస్తుంది కాబట్టే విద్యా కమిషన్ మౌనంగా ఉంది. భూములు అమ్మి పాలించుడేంది’’ అని ప్రశ్నించారు బండి సంజయ్. అంతేకాకుండా కేంద్రం అందిస్తున్న పలు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోందని ఆరోపించారు.
‘‘5 కిలోల బియ్యం ఇస్తుంది ఎవరు? కేంద్రమా రాష్ట్ర ప్రభుత్వమా? స్పష్టం చేయండి. కేంద్రం రూ.10 వేల కోట్లు ఇస్తుందా? లేదా? అనేది చెప్పండి. అదనంగా పది రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తోంది. ప్రతి రేషన్ షాపుకు బీజేపీ కార్యకర్తలు వెళ్లి తనిఖీ చేయాలి. ప్రతి కిలో బియ్యానికి రూ.50 కేంద్రం ఇస్తుందని చెప్పాలి. రేషన్ బియ్యం అందిస్తున్న సంచులపై, రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఎందుకు పెట్టరు’’ అని ప్రశ్నించారు.