రైతు సూసైడ్ పై సీఎం సీరియస్ రియాక్షన్
ఖమ్మంలో రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఖమ్మంలో రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన భూమిని తవ్వి పాడు చేశారని తీవ్ర మనస్థాపానికి చెందిన ప్రభాకర్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.అంతకంటే ముందు తనకి జరిగిన అన్యాయాన్ని ఆయన వీడియోలో వివరించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. రైతు మృతిపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రైతు ఆత్మహత్యకి కారణమేంటి?
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన బి.ప్రభాకర్(45) తన వ్యవసాయ భూమికి నష్టం వాటిల్లిందని మనస్థాపానికి గురయ్యారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఆయన.. తన ఆత్మహత్యకి కారణమేంటో వీడియోలో రికార్డ్ చేసి, అనంతరం పురుగులమందు తాగి మరణించారు. గ్రామానికి చెందిన గ్రామస్తులు కూరపాటి కిషోర్, పెంట్యాల రామారావు, జి.నాగమల్లేశ్వర్‌రావు, మొగిలి శ్రీను, ముత్తయ్య సర్వే నంబర్ 277, 276లోని తనకున్న మూడెకరాల పంట భూమిని తవ్వి పాడుచేశారని ఆయన వీడియోలో పేర్కొన్నారు.
స్థానిక ఎస్‌ఐ, తహశీల్దార్‌లకు ఫిర్యాదు చేసినా వారు తమ సమస్యను పరిష్కరించలేదని, దీంతో సోమవారం ఖమ్మం వచ్చి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా గ్రీవెన్స్ సెల్ మీటింగ్ ముగియడంతో కుదరలేదు అని వీడియో ద్వారా ప్రభాకర్ తెలిపారు. తాను రికార్డ్ చేస్తున్న వీడియోని సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ల ద్రుహ్టికి తీసుకెళ్లాలని రైతులని కోరారు.
అనంతరం పురుగుమందు తాగి తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, తన చావుకి బాధ్యులైన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించి, ఘటనా స్థలానికి చేరుకునే సరికి ప్రభాకర్ శవమై కనిపించాడు. వెంటనే వారు ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభాకర్ మృతి పట్ల కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొద్దుటూరు గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ కి ఓటేసిన పాపానికి రైతు బలి -బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రాష్ట్రంలో రైతులు బలవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. "కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్న అని ఒక రైతు ప్రభాకర్ ఖమ్మంలో చనిపోయారు. కండ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన రైతు ఆత్మహత్య బాధాకరం. వీడియో చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం" అని హరీష్ రావు అన్నారు. కాగా, సదరు రైతు భూమిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులు కబ్జా చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది.