కుమారి ఆంటీకి సీఎం రేవంత్ అండ  ఆ ఫుడ్ స్టాల్ అక్కడే ఉంటుందని ట్వీట్
x
కుమారి ఆంటీ మెస్

కుమారి ఆంటీకి సీఎం రేవంత్ అండ ఆ ఫుడ్ స్టాల్ అక్కడే ఉంటుందని ట్వీట్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో, ఎందుకు ఇబ్బంది పడతారో కుమారి ఆంటీ ఓ మంచి ఉదాహరణ. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డే స్పందించాల్సి వచ్చింది..


సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో, ఎందుకు ఇబ్బంది పడతారో కుమారి ఆంటీ ఓ మంచి ఉదాహరణ. చినికి చినికి గాలి వాన అయినట్టుగా ఇప్పుడా వ్యవహరం తెలంగాణ సచివాలయాన్ని తాకింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డే స్పందించాల్సి వచ్చింది. ఆ కథేమిటంటే...


హైదరాబాద్ మాదాపూర్ లో ఓ చిన్న ఫుడ్ స్టాల్ యజమాని కుమారి. అందరూ ఆమెను ఆంటీ ఆంటీ అని పిలుస్తుంటారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో పని చేసే వారికి భోజనం పెడుతూ నాలుగు రాళ్లు వెనకేసుకుని పొట్టపోసుకుంటోంది ఆ కుటుంబం. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్ లో వంద రూపాయలకే తిన్నంత నాన్ వెజ్ భోజనం పెట్టేది. వంటలు రుచిగా ఉండడంతో తాకిడి కూడా పెరిగింది. ఈలోపు ఓ యూ ట్యూబర్ ఆమెను ఇంటర్వ్యూ చేయడం, అది వైరల్ కావడంతో జనం రెట్టింపు అయ్యారు. భోజనం ధర కూడా వంద నుంచి రెండొందలకు పెరిగింది. అయినా జనం తగ్గలేదు. ఎక్కడెక్కడి వాళ్లో అక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్లడం మొదలు పెట్టారు. మరోపక్క యూ ట్యూబర్ల తాకిడీ పెరిగింది. రోజుకో చానల్ వాళ్లు రావడంతో కుమారి ఆంటీ భోజనానికి గిరాకీ బాగా పెరిగింది. ట్రాఫిక్ జామ్ కావడం మొదలైంది. బాగా రద్దీగా ఉండే మాదాపూర్ ప్రాంతంలో ఈ హోటల్ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఫుట్ పాత్ స్టాల్ కావడంతో బండ్లు ఆపడం, తిండి తినడానికి జనం ఎగబడడంతో ఫుడ్ స్టాల్ ని బంద్ చేయమని పోలీసులు చెప్పారు. ఆ స్టాల్ ను, ఫుడ్ ట్రక్ ను ఎత్తేశారు. ఏ సోషల్ మీడియా వల్ల అంత పాపులర్ అయ్యారో కుమారి ఇప్పుడు అంత ఇబ్బంది పడాల్సి వస్తోంది.

సోషల్ మీడియాతో లాభ నష్టాలెన్నో...

సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశంలోని చాలా మంది తమ బిజినెస్ ను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుడ్ బిజినెస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో లక్షల్లో సంపాదన పొందుతున్నారు. ఈ కోవకు చెందిందే హైదరాబాద్ కుమారి ఆంటీ. తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఫుడ్ ను రుచికరంగా అందించడం ఇమే విషేశం. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు కూడా ఆంటీ దగ్గర భోజనం రుచి చూశారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనర్కర్లేదు. అయితే ఈ క్రేజ్ కాస్త ఆమె బిజినెస్‌ను భారీగా పెచింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ పడుతుండటంతో ట్రాఫిక్ అధికారులు సీరియస్ అయ్యారు. కుమారి అంటీ ఫుడ్ సెంటర్ కు పర్మిషన్ లేదనే కారణంగా ఆమె ఫుడ్ సెంటర్‌ను అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించినట్లు తెలస్తుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె వద్దకు వెళ్లి పర్మిషన్ లేనందు ఫుడ్ సెంటర్ ను తొలగిస్తున్నాము. మా డ్యూటీ మేము చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు కుమారి అంటీకి తెలిపారు. పోలీసులు ఇచ్చిన తాకీదులతో ఆమె కన్నీరు మున్నీరయ్యారు. తన సమస్యపై సీఎంను కలుస్తానని కుమారీ ప్రకటించారు.

కుమారికి అండగా నిలిచిన సీఎం రేవంత్...

కానీ, ఇంతలోనే సీఎం రెస్పాండ్ అయ్యారు. అధికారుల నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ స్టాల్ స్థల మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ, ఎంఏయూడీ అధికారులకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. కుమారి మొన్నటివరకు వ్యాపారం చేసుకున్న స్థానంలోనే తన వ్యాపారాన్ని తిరిగి కొనసాగించుకోవచ్చని తెలిపారు. ప్రజా పాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. త్వరలోనే ఆమె స్టాల్‌ను సందర్శిస్తామని సైతం రేవంత్ తెలిపారు. సీఎంఓ నుంచి ఈమేరకు ట్వీట్ చేశారు.

కుమారి ఫుడ్ స్టాల్ పై నెగటివ్ ప్రచారం...

యూ ట్యూబర్లతో పాపులర్ అయి లక్షల్లో సంపాయించినప్పుడు ఏమీ అనని కుమారి ఇప్పుడు యూ ట్యూబర్లను తిట్టడంతో విమర్శలపాలయ్యారు. కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఆమెకు లక్షల్లో ఆదాయం వస్తున్నపుడు అందరికీ ఎగబడి ఇంటర్వ్యూలు ఇచ్చిన కుమారి ఇప్పుడు తిట్లకి లంకించుకోవడం అన్యాయం కాదా అని ప్రశ్నించిన వారూ లేకపోలేదు. అయినా ఆమెను ఇప్పుడు మళ్లీ ఆదుకున్నది కూడా సోషల్ మీడియానే. దీనిపై కుమారి ఆంటీ స్పందించారు. తనకు లక్షలు వస్తున్నాయని అందరూ అనుకుంటారు. కానీ అందులో వాస్తవం లేదని కుమారి ఆంటీ ఓ మీడియాతో మాట్లాడే సందర్భంలో తెలిపారు. అంతేకాక తనకు ఎంత ఆదాయం వస్తుందో కూడ వివరించారు. తనకు లక్షల్లో ఆదాయం వస్తే.. ఇలా రేకుల ఇంట్లో ఎందుకు ఉంటానని, ఇంకా మంచిగా ఉండే దాని కదా అంటూ అమె చెప్పుకొచ్చారు.

తనకు లక్షల్లో ఆదాయం రావట్లేదని, రోజుకి కేవలం రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకే వస్తాయని తెలిపింది. తాను నెంబర్ వన్ క్యాలిటీ వస్తువులనే ఫుడ్ తయారీలో వినియోగిస్తాని ఆమె తెలిపారు. ఉదయం సరకులు తెస్తే.. సాయంత్రానికి వాళ్లకు డబ్బులు ఇచ్చేవాళ్లమని ఆమె తెలిపారు. అలా మొత్తం సాయంత్రానికి అన్ని ఖర్చులు పోను రోజుకు ఐదువేలు మాత్రమే మిగులుతాయన్నారు.

ఏదైతేనేం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కథకి శుభం కార్డు పడింది. సాక్షాత్తు ముఖ్యమంత్రే స్పందించారు. ఆమెకు అండగా నిలుస్తామన్నారు. త్వరలో ఆమె స్టాల్ ను సందర్శిస్తామన్నారు.

Read More
Next Story