షాద్ నగర్ ఘటనపై అధికారులకు రేవంత్ ఆదేశాలు
షాద్ నగర్ ఘటనపై అధికారులకు రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్ పరిధిలోని షాద్ నగర్ లో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు ఘటనా స్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రమాదంలో ఆరుగురు మృతి...
రంగారెడ్డి - షాద్ నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కంప్రెసర్ గ్యాస్ బ్లాస్ట్ పేలడంతో సుమారు 15 మందికి తీవ్ర గాయాలు కాగా ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారి మృతదేహాలు ఛిద్రమవడంతో వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి...
షాద్ నగర్ ప్రమాదంలో ఆరుమంది మృతి చెందడం, పలువురు గాయపడడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపి, సంతాపం ప్రకటించారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.