
‘సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడం మన బాధ్యత’
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒక అభ్యర్థిని ఎన్నుకోవడం మాత్రమే కాదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
ఉపరాష్ట్రపతి పదవికి జరగనున్న ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో విపక్షాల ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని రేవంత్ తెలిపారు. ఆయనను గెలిపించుకోవడం అవసరం మాత్రమే కాదని.. మన తెలుగు ప్రజల బాధ్యత అని ఆయన అన్నారు. ఈ అంశంపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ ఎన్నికల రెండు పార్టీలో, రెండు రాజకీయ కూటముల మధ్య ఒక పదవి కోసం జరుగుతున్నది కాదన్నారు. ఈ సంగ్రామంలో ఒకవైపు ఓట్ల చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ, మరోవైపు మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం పోరాడుతున్న ఇండి కూటమి ఉన్నాయని, ఇది ముమ్మాటికీ సిద్దాంతపరమైన పోరాటమేనని ఆయన అన్నారు. ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్‌ను గెలిపించుకుంటే బీసీలకు తీరని అన్యాయం జరగడం ఖాయమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
‘‘ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించడం తెలుగు ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవాన్ని పెంచింది. రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణం. ఆయన్ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడిపై ఉంది. పీవీ నర్సింహారావు తరువాత ఒక తెలుగువాడిని ఆ స్థాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణం. రాజకీయాలకు అతీతంగా మనం ఏకం కావాల్సిన సందర్భం ఇది. తెలుగువాడికి దక్కిన గౌరవం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటన. ఉభయ రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అన్నారు.
‘‘జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. చంద్రబాబు నాయుడు, కెసీఆర్, పవన్ కళ్యాణ్, కమ్యూనిస్ట్ సోదరులు, ఉభయ రాష్ట్రాల బీజేపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు.. ఆయన ఇండియా కూటమి ప్రతిపాదించిన న్యాయనిపుణుడు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్. 1991 లో ప్రధాని రేసులో ఉన్న పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినపుడు.. ఆనాడు ఎన్టీఆర్ ఆయనపై పోటీ పెట్టకుండా మద్దతు పలికారు’’ అని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈనాడు ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞత ప్రదర్శించాలని, మనమంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు.