
‘తెలంగాణలో పాలన పడకేసింది’.. రేవంత్‌పై రఘునందన్ విమర్శలు
సీఎం స్థానంలో ఒక బీసీని కూర్చోబెట్టాలని కోరుతూ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు సూచించారు రఘునందన్ రావు.
మంత్రిత్వ శాఖలను భర్తీ చేసుకోవడం చేతకాని సీఎం ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒక్క మంచి పని జరిగిందా? అని ప్రశ్నించారు. ప్రజా పాలన పడకేసిందని చురకలంటించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన తొమ్మిది రోజులు అవుతుంటే ఇప్పటి వరకు అక్కడి వెళ్లడానికి కూడా సీఎం రేవంత్‌కు సమయం లేదని, కానీ ఎమ్మెల్సీ తరపున ప్రచారం చేయడానికి మాత్రం టైమ్ ఉందంటూ ఎద్దేవా చేశారు. తొమ్మిది రోజులుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ దగ్గరకి వెళ్లని సీఎం ఈరోజు వెళ్లడానికి రెడీ అవుతున్నారని, అంతా అయ్యాక వెళ్లడం దేనికోసమంటూ ఎద్దేవా చేశారు. పాలన చేతకాక ప్రతిపక్షాలపై కాంగ్రెస్ నోరేసుకుని పడుతోందని, అధికార బలంతో ప్రశ్నిస్తున్న వారి గొంతులు నొక్కేస్తోందని ఆరోపించారాయన.
ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌కు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ లభించలేదని, నిజంగానే రాహుల్‌ను కలిసి ఉంటే ఒక్క ఫొటో కూడా ఎందుకు రిలీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడి పదవిని పేరుకే ఒక బీసీకి ఇచ్చారని, దమ్ముంటే సీఎం పదవిని బీసీకి ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాకుండా సీఎం స్థానంలో ఒక బీసీని కూర్చోబెట్టాలని కోరుతూ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు సూచించారు రఘునందన్ రావు. జీహెచ్ఎంసీలో ఒక అధికారి ఐదేళ్లుగా డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. మున్సిపల్ పాలనపై రేవంత్‌కు పట్టు లేదన్నారు బీజేపీ ఎంపీ.అదే విధంగా మామునూరు విమానాశ్రయం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారంతా ఘర్‌వాపసీ కావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఆరు మంత్రిత్వ శాఖలను భర్తీ చేసుకోలేని సీఎం రేవంత్ అంటూ విసుర్లు విసిరారు.
‘‘త్రిభాషా సిద్దాంతానికి పునాదులు వేసిన పార్ట కాంగ్రెస్. ఆ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉర్దూ ఎందుకు వినియోగంలో ఉంది. రాష్ట్రంలోని 90 శాతం మంది ప్రజలకు ఉర్దూ రాదు. అయినా బోర్డులపై ఎందుకు రాస్తున్నారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ అనుమతి తీసుకుని రేవంత్.. తెలుగులో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటులో ఏ భాషలో మాట్లాడతారు. వ్యక్తిగత విమర్శలపై మేమూ మాట్లాడగలం. సిద్ధాం, ప్రజా సమస్యలపై చర్చకు మేము సిద్ధం. వేదిక, సమయం సీఎం నిర్ణయించాలి’’ అని ఛాలెంజ్ చేశారు రఘునందన్ రావు.