
‘విభజన హామీలు నెరవేర్చండి’.. ప్రధానిని కోరిన రేవంత్
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండని ప్రధానికి సీఎం వినతులు అందించారు.
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ప్రధాని మోదీ అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలోని పలు ప్రాజెక్ట్‌ల గురించి చర్చించారు. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్ట్‌లకు కేంద్రం నుంచి నిధులు అందించాలని కోరారు. విభజన హామీలు, పెందింగ్ నిధులు, ఎస్ఎల్‌బీసీ ప్రమాదం వంటి పలు ఇతర అంశాలపై కూడా చర్చ జరిగింది. ఎస్ఎల్‌బీసీలో చేపట్టిన సహాయక చర్యలపై కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. ఈ భేటీలో పలు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ముసీ ప్రక్షాళన, ఆర్ఆర్ఆర్, మెట్రో విస్తరణ వంటి విషయాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. రేవంత్, మోదీ భేటీలో ఫ్యూచర్ సిటీ ప్రస్తావన కూడా వచ్చాయి.
చర్చించిన అంశాలివే..
హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో ఫేజ్-II కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన 5 కారిడార్లను ప్రతిపాదించామని వివరించారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రికి తెలిపారు.
ఆర్ఆర్ఆర్‌కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని వివరించారు. ఈ రీజినల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానత (కనెక్టవిటీ) సులభమవుతుందని, రీజినల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజినల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరమని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్ట్ లను కలిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని సమాంతరంగా రైలు మార్గం మంజూరు కోరారు. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని... రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తోందని.. అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అందచాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని, సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనమతించాలని కోరారు.