
కామారెడ్డి, మెదక్‌కు రెడ్ అలెర్ట్..
అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మరోసారి దంచికొడుతున్నాయి. హైదరాబాద్ వాసులను రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం హడలెత్తిస్తోంది. ఈ క్రమంలోనే కామారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. భారీగా కురుస్తున్న వర్షాలతో నగరవ్యాప్తంగా రహదారులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమై ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ వర్షాల వల్ల ట్రాఫిక్ కూడా అతిపెద్ద సమస్యగా మారింది. వర్షాలు, భారీ ట్రాఫిక్ కారణంగా హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రధాన రహదారుల్లో సైతం గంటల తరబడి వేచి చూస్తే మీటర్ల దూరం మాత్రమే ప్రయాణిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.
సీఎం రేవంత్ హెచ్చరిక
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు గారు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పలు జిల్లాల్లో ఈరోజు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచాలని, భారీగా నీరు చేరే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.