రేవంత్‌‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది: కవిత
x

రేవంత్‌‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది: కవిత

ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే దాన్ని సందర్శించే సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని విమర్శించారు.


తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి ప్రజల సమస్యలు, వారి సంక్షేమం పట్టడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సోయిలేని సీఎం, పాలన చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారామే. తన మహబూబాబాద్‌ పర్యటనలో భాగంగా ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని, రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నలు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, అమలైనట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్న పథకాలు కూడా అంతంత మాత్రమేనని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్‌లో నడుస్తోందని చురకలంటించారు.

సీఎంకు కేసీఆర్ ఫోబియా

‘‘తెలంగాణ ప్రభుత్వం పీపీపీ మోడ్‌లో నడుస్తోంది. పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సెంటేజ్. ఫోబియా అంటే సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. చేతిలోకి మైక్ రావడం ఆలస్యం కేసీఆర్‌ను విమర్శించడం, తిట్టడమే పరమావధిగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు. చేతిలో మైక్ ఉన్నంతసేపు కేసీఆర్‌ను తిట్టడం తప్ప సీఎం బుర్రలోకి మరో ఆలోచనే రావట్లేదు. ప్రజా సమస్యలు, రైతుల కష్టాలను గాలికి వదిలేసి నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్లారు ఈ సీఎం. ప్రజా పాలన అందిస్తామంటూ పగ్గాలు పలికి సీఎంకు అధికారం వచ్చిన తర్వాత ఆ ప్రజలే గుర్తుకు రావడం లేదు’’ అని విమర్శించారు.

కాంగ్రెస్‌ది పర్సంట్ పాలన

‘‘రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బయట అంతా కూడా 10 పర్సెంట్ సర్కార్ అని పిలుస్తున్నారు. పలాన చోట పర్సెంటేజీ ఇస్తే పని చేస్తున్నారని కొంత మంది చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన జరగడం లేదు. పర్సంటేజ్ పాలన జరుగుతోందని చాలా మంది చెప్తున్నారు. ఏ పని పూర్తికావాలన్నా ముడుపులు అందితే చాలని చెప్తున్నారు. పనిని బట్టి ప్రభుత్వం ముడుపులను నిర్ణయిస్తుందని బయట చెప్తున్నారు. 10 నుంచి 30 శాతం వరకు ఈ ముడుపులు అందుకుంటున్నట్లు అనేక మంది తమకు వివరించారు’’ అని కవిత అన్నారు.

ఇక్కడికే గతిలేదు.. పక్క రాష్ట్రాల్లో ప్రకటనలు

‘‘ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదీ ప్రభుత్వం. మహిళలకు రూ.2500 ఇవ్వలేదు కానీ ఇచ్చేశామని పక్క రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తున్నారు. ఇక్కడ హామీల అమలుకు గతిలేదు కానీ.. పక్క రాష్ట్రాల్లో హామీలు అమలు కాకపోతే తనను అడగాలని, వాటిని అమలు చేసే బాధ్యత తనదని భరోసా ఇస్తున్నారు. పీఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజలకు పనిచేయడంలో లేదు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చేయవద్దు. బస్సుల సంఖ్య పెంచాలి... అప్పుడే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరుకుతాయి’’ అని సూచించారు.

కన్నీరు పెడుతున్న మిర్చి రైతులు

‘‘అటో డ్రైవర్లకు ఏడాదికి రూ 12 వేలు ఇవ్వాలి. బీఆర్ఎస్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేవలం రాజకీయం తప్పా పరిపాలనపై రేవంత్ సర్కారుకు దృష్టి లేదు. మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పండింది. ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడితే మద్ధతు ధర కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదు. అందుకే రైతులు, ప్రజల కోసం ఒక్కటంటే ఒక్క పని కూడా చేయట్లేదు. ప్రజల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. ఢిల్లీ వెళ్తే మోదీ బడాబాయ్ అంటూ.. మాట్లాడే సీఎం.. రాష్ట్రంలో మాత్రమే కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్బాలు పలుకుతున్నారు’’ అని మండిపడ్డారు.

ప్రజలకు అండగా ఉండేది బీఆర్ఎస్ ఒక్కటే!

‘‘ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే దాన్ని సందర్శించే సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ప్రజలకు ఏం చేశారని ప్రచారం చేయడానికి? రైతు రుణమాఫీ ఎవరికీ పూర్తిగా కాలేదు. రైతు భరోసా గ్రామాల్లో చాలా మందికి రాలేదు. రుణ మాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్వింటాలు మిర్చికి రూ 25 వేల మద్ధతు ధర కల్పించాలి. వరదలు వచ్చినప్పుడు చేస్తామన్న సాయాన్ని ప్రభుత్వం చేయలేదు. వరద బాధితులకు ఇళ్లు ఇస్తామని ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి. వరదలొచ్చినా, కన్నీళ్లిచ్చినా, కష్టాలొచ్చినా అండగా ఉండేది గులాబీ జెండానే’’ అని తెలిపారు. కేసీఆర్ హయాంలో మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి చెందిందని, కేసీఆర్ హయాంలో మంజూరైన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని కవిత డిమాండ్ చేశారు.

Read More
Next Story