ఢిల్లీ పోలీసులతో రేవంత్ ఢీ అంటే ఢీ
x
Revanth and Amith Shah

ఢిల్లీ పోలీసులతో రేవంత్ ఢీ అంటే ఢీ

ఢిల్లీ పోలీసులతో రేవంత్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. విషయం ఎంతదూరం వెళ్ళినాసరే ఢిల్లీ పోలీసులతో తేల్చుకోవటానికి రేవంత్ సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది.


ఢిల్లీ పోలీసులతో రేవంత్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. విషయం ఎంతదూరం వెళ్ళినాసరే ఢిల్లీ పోలీసులతో తేల్చుకోవటానికి రేవంత్ సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. గడచిన నాలుగురోజులుగా ఢిల్లీనుండి వచ్చిన పోలీసులు హైదరాబాద్ లోనే కాచ్చుక్కూర్చున్నారు. రెండుసార్లు గాంధీభవన్ కు వచ్చి సోషల్ మీడియా విభాగాన్ని చూస్తున్న ఐదుగురికి నోటీసులు ఇచ్చి గురువారం అరెస్టుచేశారు. మే 1వ తేదీన ఢిల్లీలో విచారణకు రావాల్సింగా నోటీసులో చెప్పారు. అలాగే రేవంత్ కు కూడా నోటీసిచ్చి 1వ తేదీన విచారణకు రమ్మని చెప్పాలన్నది పోలీసుల ఆలోచన. అయితే అందుకు రేవంత్ అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఊపిరిసలపని బిజీలో ఉన్న రేవంత్ ఢిల్లీ పోలీసులు, నోటీసులు, విచారణను అసలు పట్టించుకోవటమే లేదు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫుడు వీడియోలను వైరల్ చేయటంలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంగాలో కీలకమైన మన్నె సతీష్ తో పాటు విష్ణు, వంశీ, తస్లిమా, నవీన్ భాధ్యులని ఢిల్లీ పోలీసులు నోటీసులు అందించారు. అలాగే రేవంత్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమిత్ షా పై మార్ఫుడు వీడియోను వైరల్ చేశారన్నది పోలీసుల అభియోగం. అయితే రేవంత్ తనపై వస్తున్న ఆరోపణలను కొట్టేశారు. కారణం ఏమిటంటే టీ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాకు తనకు ఏమిటి సంబంధం అని అడుగుతున్నారు. టీ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించటంలేదని చెప్పారు. తెలంగాణా ముఖ్యమంత్రి పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాతో పాటు తన సొంత ఖాతా మాత్రమే తాను నిర్వహిస్తున్నట్లు పదేపదే చెబుతున్నారు.

అయితే ఇక్కడ రేవంత్ మరచిపోయిందేమిటంటే తెలంగాణా కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాను వ్యక్తిగతంగా రేవంత్ నిర్వహించకపోయినా పార్టీ అధ్యక్షుడి హోదాలో అందుకు నైతిక బాధ్యత వహించాల్సింది తానే. అయితే రోజుకు కొన్ని వందల ట్వీట్లు పార్టీ ఖాతానుండి వెళుతుంటాయి కాబట్టి ప్రతి ట్వీట్ ను రేవంత్ చూడలేరు, చూడరు కూడా. ఇలాంటి సమస్య వచ్చినపుడే గొడవవుతుంది. ఇపుడు జరుగుతున్నది ఇదే. ఢిల్లీ పోలీసులేమో రేవంత్ కు నోటీసులు అందించి విచారణకు అయ్యేట్లు చేయాలని పట్టుదలగా ఉన్నారు. అయితే రేవంత్ మాత్రం పోలీసులకు సహకరించేది లేదంటున్నారు. తనకు సంబంధంలేని విషయంలో నోటీసులిచ్చి విచారణకు హాజరవ్వాలంటే తానెందుకు హాజరవుతానని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్ధుల విజయానికి తాను కష్టపడుతున్న సమయంలో కావాలనే బీజేపీ పెద్దలు ఢిల్లీ పోలీసులను అడ్డుపెట్టుకుని పార్టీని మానసికంగా దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు రేవంత్ ఆరోపిస్తున్నారు. దురుద్దేశ్యపూర్వకంగా ఇచ్చే నోటీసులను తాను లెక్కచేయనని రేవంత్ తెగేసి చెబుతున్నారు. ఎన్నికలు అయిపోయేవరకు తాను నోటీసులకు స్పందించనని, విచారణకు హాజరయ్యేదిలేదని స్పష్టంగానే చెబుతున్నారు. విచారణకు హాజరయ్యేందుకు రేవంత్ కు నెలరోజుల వ్యవధి కావాలని పార్టీ లీగల్ టీం ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. అయితే ఆ లేఖను పోలీసులు పట్టించుకోవటంలేదు. అందుకనే రేవంత్ కూడా పోలీసులతో ఢీ అంటే ఢీ అనే పద్దతిలోనే రెడీ అవుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story