దేశంలో తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ప్రారంభించిన రేవంత్
x

దేశంలో తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ప్రారంభించిన రేవంత్

ఉన్నవి బాగుచేయకుండా ఇదేమిటి అంటున్న మేధావులు


తెలుగు రాష్ట్రాలలో ఎన్నడూ లేని విధంగా ఒక శాస్త్రీయ విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఈ రోజు తెలంగాణలో ప్రారంభం అయింది. దాని పేరు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ వద్ద ఇది ఏర్పాటు అవుతున్నది. 300 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ యూనివర్శిటీలో బీఎస్సీలో జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌తోపాటు ఎమ్మెస్సీలో జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియర్‌ సైన్స్‌, జియో ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌ వంటి కోర్సులను అందిస్తారు.

సుమారు 300 ఎకరాల్లో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. విశ్వ విద్యాలయ నిర్మాణానికి సుమారు రూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. అందులో తరగతి గదులు, హాస్టల్‌ భవనాలు, గ్రంథాలయం, సమావేశ మందిరం ఆట స్థలాలు, రీసెర్చ్‌ సెంటర్‌ లాంటి నిర్మాణాలకు రూ.500కోట్లు వరకు ఉండగా.. మరో రూ.500 కోట్లతో ప్రింటింగ్‌ మెషీన్లు, ఇంటర్‌నెట్‌, కంప్యూటర్లు, ఏసీలు, విద్యార్థుల ప్రయోగాలకు సంబంధించిన ల్యాబ్‌లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

1976లో కొత్తగూడెం లో ఏర్పాటు చేసిన ‘స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ భవనాలలోనే ఈ యూనివర్శిటీ వస్తున్నది. మొదట కేవలం మైనింగ్‌ ఇంజనీరింగ్‌తో ఈ విద్యా సంస్థ ప్రారంభమైంది. ఎంఎస్సీ జియాలజీ కోర్సును తోడయింది. 1993లో ఆ కళాశాలను కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. అనంతరం 1994లో సీఎస్సీ, ఈఈఈ గ్రూపులను ప్రవేశపెట్టారు. 2011లో ఈసీఈ, ఐటీ గ్రూపులను చేర్చారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలగా ఉన్న ఈ విద్యా సంస్థను పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా మార్చారు. ఇదొక మంచి పరిణామం.

అయితే, ఈ సంస్థను ఎలా నడిపిస్తున్నారో అనేది స్పష్టంగా ప్రభుత్వం వెల్లడించడం లేదు. ఇపుడు రాష్ట్రంలో జిల్లాకొక విశ్వవిద్యాలయం ఉంది. అవెలా నడుస్తున్నాయో అందరికి తెలుసు. అద్యాపకులు, ప్రొఫెసర్లు, రీసెర్చ లేదు. వైస్ చాన్స్ లర్ల నియమకాలన్నీ రాజకీయంగా జరుగుతాయి. ఒక కులం ప్రొఫెసర్ ను ఒక యూనివర్శిటీలో వైఎస్ చాన్స్ లర్ చేస్తే, మరొక కులం ప్రొఫెసర్ నివెదికి పట్టుకొచ్చి మరొక చోట వైఎస్ చాన్స్ లర్లు వేస్తున్నారు. వీళ్ల వల్ల యూనివర్శటీలకు ప్రతిష్ట ఎంత పెరిగిందో అంతాతెలుసు.

యూనివర్శీటీలన్నీ అవినీతి బంధుప్రీతితో కంపుకొడుతున్నాయి. టీచింగ్ బాగండదు, హాస్టళ్లు బాగుండవు. ఇక్కడ జరిగే రీసెర్చ్ బాగుండదు. ఆ మధ్య ఒక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ ఉద్యోగంల నుంచి పీకేశారు. బాసర లో వుంటే ట్రిపుల్ ఐటికి సకలరోగాలున్నాయి. అక్కడ ఎంత మంది విద్యార్థులు ఆత్మ హత్య చేసుకున్నరో, తెలంగాణలో ఏ ఒక్క యూనిర్శిటీ ఏమాత్రం గర్వపడేలా లేదు, డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్శిటీ ఇంతకంటే భిన్నంగా ఉంటుందా. అడ్మిషన్స్ ఎలా చేస్తారు. గవర్నింగ్ బాడీలో ఎవరుంటారు? అద్యాపకులు ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాలకు మూడు ప్రాంతాకు మూడు ట్రిఫుల్ ఐటిలను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా గొప్ప ప్రయత్నంచేశారు. ఖరగ్ పూర్ ఐఐటి నుంచి రాజ్ కుమార్ అనే ప్రొఫెసర్ ని వైస్ చాన్సలర్ గానియమించారు. అమెరికాకు చెందిన ప్రొఫెసర్ రాజ్ రెడ్డి సలహాదారుగా ఉన్నారు. ప్రొఫెషర్ రాజ్ కుమార్ ఐఐటి లనుంచి ఫ్యాకల్టీని తెప్పించి బాసర, పులివుందుల, నూజి వీడులలోని ఈ ట్రిపుల్ ఐటిలను జాతీయ కేంద్రాలుగా మార్చాలనుకున్నారు.

చివరకు ఐఎఎస్ అధికారుల పెత్తనం భరించలేక రాజ్ కుమార్ మళ్లీ తన ఐఐటికి పారిపోయారని చెబుతారు. ఒక విద్యాసంస్థకు బలమయిన స్వయం ప్రతిపత్తినిస్తే అధికారులనుంచి సమస్యలు ఎదురవుతాయి. విద్యాసంస్థల్లో బ్యూరోక్రసీ జోక్యం ఎక్కువయిందని విమర్శ ఉంది.

అయితే, బ్యూరోక్రసీ జోక్యంతో విద్యా సంస్థలు గొప్పగా రాణించిన సందర్భాలు ఉన్నాయి., దానికి ఉదాహరణ కర్నూలులో 1975 లో ఏర్పాటుయిన సిల్వర్‌ జూబిలీ కాలేజీ. అది అనాటి విద్యాశాఖ కార్యదర్శి రాజగోపాల్ అనే ఐఎఎస్ అధికారి సృష్టి. అదొక ఇరవై యేళ్లే పాటు గొప్పగా నడిచింది. ప్రత్యేకమైన‌ ఎంట్రన్స్ ద్వారా విద్యార్థలను ఎంపిక చేసేశారు. బెస్ట్ లెక్కరర్లను తీసుకువచ్చి వాళ్లకి అదనపు శాలరీ ఇచ్చేవారు. సిల్వర్‌ జూబిలీ కళాశాల విద్యార్థులు అన్నిరంగాలలో టాప్ లో ఉండేవారు.

తర్వాత ఆ కాలేజీ కూడా మామూలు కాలేజీ స్థాయికి పడిపోయింది, ఈ అనుభవాల నేపథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు తో వస్తున్న తెలంగాణ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఎలా తయారవుతుంది. ప్రారంభించి పండగ చేసుకోవడంతో ఏమీ కాదు, గొప్పవాడి పేరు పెట్టినంత మాత్రాన కూడా ఏమీ కాదు. ఎలానడుపుతారు, రాజీకయాలకు అతీతంగా నడపడగలరా? నడిపితే మంచిదే. అయితే ఇక్కడున్న ఎమ్మెస్సీ కోర్సులలో చేరేందుకు విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారు. చాలా డిగ్రీలలో జియాలజీ వంటి కోర్సులు లేవు. బిఎస్సీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులోవరూ ముందుకు రావడం లేదు కొన్ని మంచి కాలేజీలో తప్ప చాలా డిగ్రీకాలేజీల్లో 30 సీట్లు ఉంటే పదిమంది కూడా ఉండటం లేదు. లెక్చరర్లు రిక్రూట్ మెంట్ లేదు. గెస్ట్ ఫ్యాకల్టీలతో తరగుతులు లాగించేస్తున్నారు. ఒక వారం కిందట హైదరాబాద్ లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం గెస్ట్ ఫ్యాకల్టీలు కావాలని ప్రకటన ఇచ్చింది.

ఇలాంటి నేపథ్యంలో ఉన్న యూనివర్శిటీలను బలొపేతం చేయకుండా మరొక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినపుడే అనుమానాలొస్తాయి హైద‌రాబాద్‌ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ శాస్త్రవేత్తగా పనిచేసి డాక్టర్ కలపాల బాబూరావు ఈ కొత్త యూనివర్శిటీ ఏర్పాటువుతున్న తరుణంలో కొన్ని ఆసక్తికరమయిన వ్యాఖ్యాలు చేశారు.

"దేశంలో 100 ఏళ్లుగా జియాల‌జీ బోధిస్తున్నారు. ప్ర‌తి యూనివ‌ర్శిటీలో డిపార్ట్‌మెంట్ వుంది. అయితే ఇక్క‌డ మైనింగ్ కాలేజ్‌ని యూనివ‌ర్శిటీగా మార్చారు. జియాల‌జీ, జియో ఫిజిక్స్‌, జియో కెమిస్ట్రీ లో డిగ్రీ, పీజీ, పి.హెచ్‌డి, ఎన్విరాన్‌మెంట్ సైన్స్ తో పాటు ఐ.టి., కంప్యూట‌ర్ ఇంజ‌నీరింగ్ కోర్సుల‌ను ఎర్త్‌ సైన్సెస్ యూనివ‌ర్శిటీలో పెడుతున్నారు. మాజీ ప్ర‌ధాని మ‌న్ మోహ‌న్ సింగ్ పేరు పెట్ట‌డానికే ఈ యూనివ‌ర్శిటీని క్రియేట్ చేశార‌ని," డా.బాబురావు ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

"తెలంగాణా ప్ర‌భుత్వం రాష్ట్రంలో వున్న యూనివ‌ర్శిటీల‌కు 6 వేల కోట్ల రూపాయ‌లు బ‌కాయి ప‌డిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వాళ్ల‌కు ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయ‌కుండా, విద్యా సంస్థల్లో ఉన్న 74 శాతం టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుండా ఇపుడు రు. 500 కోట్ల రూపాయ‌ల‌తో మ‌న్‌మోహ‌న్‌సింగ్ ఎర్త్ సైన్సెన్ యూనివ‌ర్శిటీ ఏర్పాటు చేయడం చోద్యం" అని ఆయన అన్నారు. తర్వాత పట్టణాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నపుడు టాలెంట్ వున్న స్టూడెంట్స్ ఎక్కడో ప్వాలంచ వెళ్ళి అడ్మిష‌న్ తీసుకోవం పెద్ద స‌వాల్‌.

"100 లోపు ర్యాంక్ వున్న యూనివ‌ర్శిటీలో తెలంగాణాలో సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ, ఉస్మానియా యూనివ‌ర్శిటీ మాత్ర‌మే ఉన్నాయన్న విషయాన్న కూడా డాక్టర్ బాబురావు చెప్పారు. యూనివర్శిటీ బాగుండాలంటే ఫ్యాక‌ల్టీ వుండాలి, బ‌డ్జెట్ వుండాలని చెబుతూ తెలంగాణాలో యూనివ‌ర్శిటీలలో ఈ రెండూ లేవు అని ఆయన అన్నారు. ఉస్మానియా యూనివ‌ర్శిటీలో శాంక్ష‌న్ అయిన టీచింగ్ ఫ్యాక‌ల్టీ 1250. అయితే వుంది మాత్రం కేవ‌లం 250 మంది మాత్ర‌మే ఇలాంటి దుస్థితిలో జిల్లాకు ఓ యూనివ‌ర్శిటీ అన్నారు. అక్కడ ప‌రిస్థితి అధ్వాన్నంగా వుంది. ఇపుడు మరొక యూనివర్శిటీ ఎర్త్ సైన్స్ పేరుతో వస్తున్నదని," ఆయనచెప్పారు. అది మరొక తెలంగాణ యూనివర్శి కాకుండా దేశమంతా దాని వైపు చేసేలా ప్రణాళిక ఉండాలని ఆయన అన్నారు.

ఫ్రొఫెస‌ర్ బి.వి.సుబ్బారావు (IIT Roorkee Student)

"ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయ‌డంలో ఇప్ప‌ట్టికే చాలా ఆల‌స్యం జ‌రిగింది. ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు. జియాల‌జీ బోధ‌న‌లో ఉస్మానియా కంటే ఆంధ్ర యూనివ‌ర్శిటీ మెరుగ్గా వుంది. ఆంధ్ర యూనివ‌ర్శిటీ కంటే బ‌నార‌స్‌, సాగ‌ర్‌, రూర్‌కీ యూనివ‌ర్శిటీలో చాలా మెరుగ్గా బోధ‌న జ‌రుగుతోంది. అయితే ఎర్త్ సైన్సెస్ కు సంబంధించి ప్ర‌త్యేక యూనివ‌ర్శిటీ దేశంలో ఇదే మొద‌టిది. ఉద్దేశం మంచిదే. ఆచ‌ర‌ణ‌లో లోపం లేకుండా చిత్త‌శుద్దితో ప‌నిచేయాలి. స‌రైన ఫ్యాక‌ల్టీతో పాటు అటాన‌మీ వుండాలి. ప్ర‌భుత్వ‌, రాజ‌కీయ జోక్యం లేకుండా చూడాలి. దాని స్థాయి అది నిల‌బెట్టుకోవాలి," అని ఫ్రొఫెస‌ర్ బి.వి. సుబ్బారావు ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

మ‌న దేశంలో యూనివ‌ర్శిటీల్ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఫ్రొఫెస‌ర్ బి.వి. సుబ్బారావు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఔట‌ర్ రింగ్ రోడ్ లోప‌లున్న మున్సిపాల్టీల‌ను గ్రేట‌ర్‌లో క‌ల‌పాల‌నుకున్న‌ప్పుడు, క‌నీసం మాస‌బ్‌ట్యాంక్‌లో వున్న జెఎన్‌టీయుని సంప్ర‌దించ‌లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటి. హైదరాబాద్ యూనివర్శిటీ వంటి సంస్థలతో ధీటుగా కాకపోయి క్వాలిటీ స్టాఫ్, క్వాలిటీ ఎజుకేషన్ లేకపోతే, ఈ యూనివర్శిటీ కూడా మరొక స్టేట్ యూనివర్శిటీ అవుతుంది. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు రావు. అపుడు మంచి విద్యార్థులు చేరరు కాబట్టి మంచి ఫ్యాకల్టీ, మంచి రీసెర్చ్ అవకాశాలు, మంచి ఫండింగ్ ఉండేలా ఈ ఎర్త్ సైన్సెస్ యూనిర్శిటీని ప్రభుత్వం తీర్చిదిద్దాలి. లేకపోతే, నల్గొండ, పాలమురు, నిజామాాబాద్, కరీంనగర్ యూనివర్శిటీల జాబితాలోఇదీ చేరిపోతుంది. చివరకు ప్రారంభోత్సవ పండగ ఫోటోలే మిగులుతాయి.

Read More
Next Story