
‘సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది’
ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలను పబ్లిక్ గార్డెన్‌లో ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకున్నారు సీఎం రేవంత్. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో రాసుకోదగిన గొప్ప ఉద్యమం తెలంగాణ ఉద్యమమని పేర్కొన్నారు. సాయుధ పోరాటస్ఫూర్తితో నియంత పాలనను పక్కనబెట్టామని గుర్తు చేశారు. ఎందరో వీరులు తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాలు మరువలేనివని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు ఎంతో కీలక పాత్ర పోషించారని, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి తమ సత్తాచాటారని తెలిపారు. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని వ్యాఖ్యానించారు.
బంధుప్రీతికి స్థానం లేదు..
‘‘మా పాలనలో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి స్థానం లేదు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల్లో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. యువత.. ఉన్నత చదువుల ద్వారా తమ సత్తా చాటాలి. రానున్న కాలంలో పాఠశాలల రూపురేఖలు మారిపోతాయి. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చాం. అతి త్వరలో రాష్ట్ర విద్యావిధానాన్ని కూడా తెస్తాం. యువత భవిష్యత్తుకు బాటలు వేసే అంశంలో రాజీ పడే ప్రసక్తే లేదు’’ అని వ్యాఖ్యానించారు. అదే విధంగా మహిళా సాధికారతకు కూడా తాము పెద్దపీట వేస్తున్నామని గుర్తు చేశారు.
మహిళా మార్టులు వస్తాయి..
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. ‘‘డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్టులు ఏర్పాటు చేస్తాం. రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి మేలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడం. సాగు మోటార్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తాం. వాటి ఫలితాలను అంతే వేగంగా వెల్లడిస్తాం. సివిల్స్ రాసే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం’’ అని తెలిపారు. తెలంగాణ నుంచి మరింతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను తీసుకురావడం కోసం ఇనీషియేటివ్ తీసుకున్నామని వెల్లడించారు.
గేట్‌వే ఆఫ్ వరల్డ్‌గా హైదరాబాద్..
‘‘హైదరాబాద్‌ను గేట్ వే ఆఫ్ వరల్డ్‌గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకొస్తాం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూసీ నది పక్కన జీవించే పేదలకు అండగా ఉండి వారికి మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తాం. మూసీ నదిని పర్యాటక ప్రాంతంలో అభివృద్ధి చేస్తాం. ఈ ఏడాది డిసెంబర్ 9 లోపు అనేక అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తాం. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.
జలాల విషయంలో రాజీ లేదు..
కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రేవంత్ అన్నారు. ఎంత దూరం వెళ్లయినా రాష్ట్రానికి రావాల్సిన వాటా జాలాలను తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ‘‘గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ కుదేలయింది. కానీ గాడి తప్పిన రెవెన్యూ వ్యవస్థను మా ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టింది. ‘భూభారతి’ చట్టం తెచ్చి సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. పేదల ఆత్మగౌరవాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాం. నదీ జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. న్యాయ పోరాటానికి కూడా రెడీ. 904 టీఎంసీల సాధనకు బలమైన వాదనలు వినిపిస్తాం. నదీ జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం’’ అని వివరించారు.