
ఎల్ అండ్ టీ వెళ్లిపోవడానికి రేవంత్ బెదిరింపులే కారణమా..?
రైజింగ్ తెలంగాణ నుంచి ఎల్ అండ్ టీ ఎందుకు వెళ్లిపోయింది? అని ప్రశ్నించిన కేటీఆర్
హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ సంస్థ నిష్క్రమించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడ, రేవంత్ బెదిరింపుల వల్లే ఎల్ అండ్ టీ.. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందని అన్నారు. ఇన్నాళ్లూ ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఎల్ అండ్ టీ.. ఇప్పుడెందుకు నిష్క్రమించింది? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎల్ అండ్ టీ అంటే రేవంత్‌కు కోపం ఇప్పటిది కాదని, మేడిగడ్డ అంశంలోనే మొదలైందని విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ సెవెన్త్ బ్లాక్‌ను సొంత పైసలతో రిపేర్ చేస్తామని ఎల్ అండ్ టీ ముందుకొచ్చిందని, అప్పటి నుంచే ఆ సంస్థ అంటే రేవంత్‌కు కోపం వచ్చిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కోపంతోనే ఇప్పుడు రాష్ట్రం నుంచి ఆ సంస్థ వెళ్లిపోయేలా చేశారని ఆరోపించారు.
మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రోను కాపాడింది కేసీఆర్ అని అన్నారు కేటీఆర్. ‘‘2014లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి మెట్రో పనులు కేవలం 25శాతం మాత్రమే పూర్తయ్యాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్దతిలో 2008లో వైఎస్ఆర్ ప్రభుత్వం మెట్రో నిర్మాణానికి టెంటర్లను పిలిచింది. అప్పుడు మెటాస్ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఆ విషయాన్ని వార్తపత్రికలు చాలా విచిత్రంగా రాశాయి. మెట్రో ప్రాజెక్ట్‌లో భాగంగా సదరు సంస్థే ఉల్టాగా ప్రభుత్వానికి డబ్బులు ఇస్తాయని రాశారు. మెట్రో అనేది చాలా లాభసాటి అని రుద్దడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఆ సంస్థ ఎందుకో వెనక్కి పోయింది. దాని స్థానంలో ఎల్ అండ్ టీ టెండర్ తీసుకుంది’’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
‘‘ఒక సంస్థ ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిందంటే తమకూ ఒక రూపాయి రావాలనే భావిస్తాయి. ఎల్ అండ్ టీ సంస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని హైదరాబాద్‌లో నిలిచింది. అలాంటి సంస్థను ఎట్టకేలకు ఈ ప్రభుత్వం ఎల్లగొట్టింది. కొవిడ్ వచ్చింది. ప్రజా రవాణా స్తంభించిపోయే పరిస్థితి. మళ్లీ ఎల్ అండ్ టీ వారు కంగారు పడ్డారు. వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి.. 2070 దాకా నడపాలని ధైర్యం చెప్పి ప్రభుత్వం నుంచి సాఫ్ట్ లోన్ కింద రూ. 900 కోట్లు కేబినెట్ అనుమతితో ఇచ్చాం. ఎల్ అండ్ టీ ముందుకు పోయింది. పీక్ అవర్స్‌లో సరిపోవట్లేదు కోచ్‌లో పెంచండి అని అడిగారు. అందుకు అనుగుణంగా కోచ్‌లు కూడా పెంచాం’’ అని కేటీఆర్ తెలిపారు.
‘‘సాధారణంగా ఎక్కడైనా ఆకురౌడీలు, స్థానిక దాదాలు బెదిరింపులకు పాల్పడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం సాక్షాత్తు సీఎం పదవిలో ఉన్న వ్యక్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని అంటే.. ఎల్ అండ్ టీ సీఈఓను జైల్లో ఏమన్నారీ పెద్దమనిషి. ఈ విషయం ఆయనే చెప్పుకున్నారు. ఓ వేదికపై కూర్చుని ఏదో గొప్ప కార్యం చేసినట్లు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో వేయాలని ప్లాన్ చేశాం. దానిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తూనే రద్దు చేసింది. ఎందుకు? ఏంటి? అనేది కూడా చెప్పలేదు. కానీ దానిని కొనసాగించాలని ఎల్ అండ్ టీ కోరింది. అందుకు రేవంత్ ఒప్పుకోలే. ఆ విషయంలోనే సీఎం, ఎల్ అండ్ టీ మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. అప్పటి నుంచి సంస్థను ఇప్పండి పెట్టడం ప్రారంభించారు సీఎం. ఎట్టకేలకు ఇప్పుడు ఆ సంస్థను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు’’ అని విమర్శలు గుప్పించారు.