దసరా వేళ సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ను ప్రకటిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది సింగరేణి సంస్థ రూ 2,360 కోట్ల లాభాలు ఆర్జించింది. అందులో కార్మికుల వాటాగా 34 శాతం బోనస్ గా రూ 810 కోట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దానిలో భాగంగా ఒక్కో కార్మికుడికి దసరా కానుకగా రూ. 1,95, 610 ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు రూ 5 వేలు చొప్పున ఇవ్వగా, ఈ ఏడాది రూ 5,500 చొప్పున ఇస్తున్నారు. దీపావళికి కూడా కార్మికులకు లాభాల్లో వాటాను పంచుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటులో సింగరేణి కార్మికుల పోరాటాన్ని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. సింగరేణి బొగ్గులు వెలుగులు పంచుతున్నాయని,తాము తొలుత ఇవ్వాలని భావించిన బోనస్ కంటే ఎక్కువ ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు తో సహా సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
సింగరేణి సంస్థ రాష్ట్రప్రభుత్వానికి ఆత్మవంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు గని మాత్రమే కాదు,ఒక ఉద్యోగ గనిగా చెప్పుకొచ్చారు. సింగరేణి సంస్థలో అన్నిరకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సింగరేణి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ఉద్యోగి సంక్షేమానికి సగటున రూ. 5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. లాభాల్లో వాటాను కార్మికులకు పంచుతున్నామని చెప్పుకొచ్చారు.
గత పదేళ్లు సింగరేణి సంస్థ కొత్త బ్లాక్‌లకు వేలంలో పాల్గొనలేని పరిస్థితి ఉందని భట్టి వివరించారు. సింగరేణి సంస్థను వేలానికి దూరంగా పెట్టడం వల్ల రెండు బ్లాక్‌లు కోల్పోయిందన్నారు. ఆ రెండు బ్లాక్‌లు గత ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతికి వెళ్లాయని చెప్పారు. సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. కీలక ఖనిజాల మైనింగ్‌లోకి సింగరేణి సంస్థ వెళ్లేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. సింగరేణి సంస్థ మొత్తంగా రూ.6,394 కోట్లు ఆర్జించిందని..సంస్థ విస్తరణ ఖర్చులు, ఇతర ఖర్చులు పోను రూ.2.360 కోట్లు లాభంగా తేలిందని వివరించారు.పండగపూట బోనస్ ప్రకటనతో సింగరేణి కార్మికులలో హర్షం వ్యక్తమైంది.