
సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే..
వరద ప్రభావం, నష్టం సహా అన్ని వివరాలు సేకరిస్తున్న రేవంత్.
తెలంగాణ ప్రజలను కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా రహదారులు, కాలనీలు చెరువలను తలపిస్తున్నాయి. పలు జిల్లాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఎస్‌డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయంతో సహాయక చర్యలు అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాల జరుగుతున్న బీభత్సంపై సీఎం రేవంత్.. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ అధికారులకు కీలక ఆదేశాలిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదని, అధికారులు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు. ఇందులో భాగంగానే ఆయన ఏరియల్ సర్వే చేపట్టారు.
ఇప్పటికే ఒకసారి వాయిదా..
అయితే సీఎం ఏరియల్ సర్వే.. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అది అనూహ్యంగా వాయిదా పడింది. హెలికాప్టర్‌లో ప్రయాణించడానికి అనువైన వాతావరణం లేదని, అందువల్ల సీఎం ఏరియల్ సర్వేను వాయిదా వేసినట్లు అధికారులు చెప్పారు. అనంతరం అధికారులతో సమీక్షించిన సీఎం.. వాతావరణంలో కాస్తంత ఎడతెరిపి కనిపించడంతో అధికారులతో మాట్లాడి.. ఏరియల్ సర్వేను ప్రాంభించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఏరియల్ సర్వే నిర్వహించడానికి బయలుదేరారు. ఈ ఏరియల్ సర్వేలో ఆయన పలు అంశాలను పరిశీలించనున్నారు. పంట నష్టం, జనావాసాల పరిస్థితులు, చెరువుల ఆనకట్టల పరిస్థితి ఇలా మరెన్నో అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అంతేకాకుండా ఏరియల్ సర్వే అనంతరం వరద ప్రభావం అధికారులు సిద్ధం చేసిన నివేదికలను పరిశీలించనున్నారు. ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
రేవంత్ సర్వే షెడ్యూల్ ఇలా..
- మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి రేవంత్ బయలుదేరారు.
- మధ్యాహ్నం 2:50 గంటలకు పెద్దపల్లి జిల్లాలోని యెల్లంపల్లి ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు.
- యెల్లంపల్లి ప్రాజెక్ట్ సందర్శన మధ్యాహ్నం 2:50 గంటల నుంచి 3:25 వరకు కొనసాగుతుంది.
- మధ్యాహ్నం 3:40 నుంచి సాయంత్రం 4:10 గంటల వరకు ఆయన కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సర్వే చేస్తారు. ఈ క్రమంలోనే పోచారామ్, నిజామ్ సాగర్ ప్రాజెక్ట్‌లను కూడా పరిశీలిస్తారు.
- సాయంత్రం 4:20 గంటలకు కామారెడ్డిలోని ఎస్పీ కార్యాలయం దగ్గర హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు.
- సాయంత్రం 4:20 నుంచి 4:55 గంటల మధ్య ఆయన కామారెడ్డి జిల్లాలో వర్షాల వల్ల వాటిల్లిన నష్టంపై అధికారులతో సమీక్షిస్తారు.
- సాయంత్రం 4:55 గంటలకు ఆయన కామారెడ్డి ఎస్పీ ఆఫీసు నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
- సాయంత్రం 5:10 గంటల నుంచి 5:40 గంటల మధ్య మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.
- సాయంత్రం 5:55 గంటలకు ఆయన తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.