
‘ఆర్ఆర్ఆర్ భూసేకరణను పూర్తి చేయండి’
భూములకు పరిహారం ఇవ్వడాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కావాలసిన భూసేకరణ, భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లించడం వంటి వాటిని వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు సూచించారు. భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవరించాలని తెలిపారు. అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఆర్బిట్రేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం.. అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), జాతీయ రహదారుల విభాగం (ఎన్‌హెచ్), జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్), రహదారులు, భవనాల శాఖ, అటవీ శాఖ అధికారులతో సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులకు నెంబర్ల కేటాయింపు... సూత్రప్రాయ అంగీకారం తెలుపుతున్నా... తర్వాత ప్రక్రియలో ఆలస్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం వాటిల్లుతుండడం సరికాదని.. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులకు సీఎం సూచించారు. భూ సేకరణను వేగవంతం చేసి పరిహారం తక్షణమే అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని సూచించారు.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నార్త్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాన్ని తాము నివృత్తి చేస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను ఎందుకు లేవనెత్తుతున్నారంటూ ఎన్‌హెచ్ఏఐ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సందేహాలన్నింటిని ఒకే సారి పంపాలని అధికారులకు సూచించారు.. ఆ అంశంపై తాము చర్చించుకున్నామని... ఎటువంటి సందేహాలు లేవని, ఏవైనా ఉంటే వెంటనే పంపుతామని ఎన్‌హెచ్ఏఐ అధికారులు సీఎంకు తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ నార్త్.. సౌత్‌ను రెండు వేర్వురు ప్రాజెక్టులుగా చూడవద్దని... సౌత్‌కు కూడా నార్త్‌కు ఇచ్చిన నెంబర్‌ను కొనసాగించాలని...వెంటనే అనుమతులు మంజూరు చేసి ఏకకాలంలో రెండింటి పనులు ప్రారంభమయ్యేందుకు సహకరించాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సీఎం సూచించారు. అందుకు ఎన్‌హెచ్ఏఐ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ సౌత్ అలైన్‌మెంట్‌కు వెంటనే ఆమోదముద్ర వేయాని సీఎం కోరారు...
భారత్ ఫ్యూచర్ సిటీ-అమరావతి-మచిలీపట్నం 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో తాము డ్రైపోర్ట్... లాజిస్టిక్ పార్క్.. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య అనుసంధానం ఏర్పడడంతో సరకు రవాణా, ప్రయాణికులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉంటుందని సీఎం అన్నారు. హైదరాబాద్-విజయవాడల మధ్య 70 కిలోమీటర్లు దగ్గరవడంతో పాటు సరకు రవాణాతో భారత దేశంలో మరే జాతీయ రహదారిపై లేనంత రద్దీ.. ఆదాయం ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో ఉంటుందని సీఎం తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ రెండు రాష్ట్రాల మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని పేర్కొన్నారని సీఎం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తక్షణమే రంగంలోకి దిగి పీఎం గతిశక్తి లేదా మరే పథకంలోనైనా ఈ రహదారికి అవసరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు అలైన్‌మెంట్ ఖరారు చేయాలని సూచించారు. ఈ రహదారికి సమాంతరంగా తాము రైలు మార్గం అడుగుతున్నామని... బెంగళూర్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్-అమరావతి మధ్య రైలు మార్గం అవసరమని.. వందేభారత్ సహా ఇతర రైళ్ల రాకపోకలకు ఇది అనువుగా ఉంటుందని.. లాభసాటి మార్గమని సీఎం అన్నారు.
హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో రావిర్యాల- మన్ననూర్‌కు సంబంధించి ఎలివేటెడ్ కారిడార్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం రిజర్వాయర్, టైగర్ ఫారెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తారని సీఎం తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్‌కు అవసరమైన అనుమతులు మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్-మన్నెగూడ రహదారిలో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసు పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు. హైదరాబాద్-మంచిర్యాల-నాగ్‌పూర్ నూతన రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలనే అంగీకరించాలని సీఎం కోరారు. తాము ప్రతిపాదించిన మార్గంతో నూతన పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుతో పాటు పలు జాతీయ రహదారుల అనుసంధానం పూర్తవుతుందని సీఎం తెలిపారు.
మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-163జి), ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల (ఎన్‌హెచ్-63), జగిత్యాల-కరీంనగర్ (ఎన్‌హెచ్-563), మహబూబ్‌నగర్-మరికల్-దియోసుగూర్ (ఎన్‌హెచ్-167) రహదారులకు సంబంధించి భూ సేకరణ... పరిహారం పంపిణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పలుచోట్ల కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అన్ని జిల్లాల్లో ఉన్న కేసులన్నింటిపై నివేదిక రూపొందించి వారంలోపు అడ్వకేట్ జనరల్‌తో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిహారం పంపిణీలో ఆలస్యంపై సీఎం ప్రశ్నించగా కాలా (Competent Authority for Land Acquisation) నుంచి నిధుల విడుదలలో జాప్యం ఉందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై ఎన్‌హెచ్ఏఐ అధికారులు స్పందిస్తూ జాబితాలు అప్‌లోడ్ అయిన వెంటనే నిధులు విడుదల చేస్తున్నామని, కలెక్టర్లు ఆ పనులు త్వరగా చేయాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం జాప్యాన్ని సహించమని సీఎం కలెక్టర్లను హెచ్చరించారు. భూ సేకరణలో ఆర్బిట్రేషన్ కేసులు పెండింగ్‌లో ఉంచడం సరికాదని.. వెంటనే వాటిని పూర్తి చేయడంతో పాటు కాలాకు జాబితాలను అప్‌లోడ్ చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. భూసేకరణ, పరిహారం పంపిణీని అక్టోబరు నెలాఖరుకు కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. భూ సేకరణ, పరిహారం నిర్ణయం, పంపిణీ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లపై వేటు వేస్తామని సీఎం హెచ్చిరించారు.
జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖ పెడుతున్న కొర్రీలపైనా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. 2002 నుంచి 2022 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని... దాంతో ప్రస్తుతం అనుమతులు ఇవ్వడం లేదని ఫారెస్ట్ సౌత్ రీజియన్ ఐజీ త్రినాధ్ కుమార్ తెలిపారు. దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన అధికారులు ఇప్పుడు లేరన్నారు. ఉల్లంఘనలకు సంబంధించి వివరాలు సమర్పించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. అవసరమైనచోట ప్రత్యామ్నాయ భూమిని అటవీ పెంపకానికి ఇస్తామని సీఎం తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌లతో తాను స్వయంగా భేటీ అవుతానని సీఎం తెలిపారు. వన్యప్రాణులు లేని అటవీ ప్రాంతాల్లోనూ వన్య ప్రాణుల చట్టం అమలు చేస్తున్నారని సీఎం అన్నారు. నాన్ వైల్డ్ లైఫ్ ఏరియాల్లో వైల్డ్ లైఫ్ మిటిగేషన్ ప్లాన్‌కి ఎన్‌హెచ్ఏఐలో ఎటువంటి ప్రొవిజన్ లేకపోవడంతో అనుమతులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో అవసరమైన వ్యయం భరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో చొరవ చూపి అటవీ అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణకు సీఎం సూచించారు.