Revanth Reddy | హైకోర్టు దెబ్బకు సీఎం రేవంత్ కదిలారా..?
ప్రభుత్వ పాఠశాలల్లో సంభవిస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఎట్టకేలకు రేవంత్ స్పందించారు. ఇన్నాళ్లూ ఏమైంది..
తెలంగాణ వ్యాప్తంగా రోజూ ఎక్కడో ఒకచోటు ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్‌పాయిజన్(Food Poison) ఘటనలు వెలుగు చూస్తున్నాయి. బుధవారం.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో 29 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. అదే పాఠశాలలో వారం రోజుల క్రితం దాదాపు 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. ఇలా తరచూ ఎక్కడో ఒకచోట ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్తులు ఫుడ్ పాయిజన్‌కు గురికావడంపై తెలంగాణ హైకోర్టు(High Court) సీరియస్ అయింది. కాగా తాజాగా ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ఆహారం విషయంలో ఇంతటి నిర్లక్ష్యం పనికిరాదని, విద్యార్థులను పాఠశాల యంత్రాంగం కన్నబిడ్డల్లా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి రోజూ ఆహారం వికటిస్తుండటం చాలా ఆందోళనకర అంశమని, ఇటువంటి పరిస్థితులు రోజూ వెలుగు చూస్తున్నా అధికారులు ఎందుకని చర్యలు తీసుకోవడం లేదని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో ఎక్కడా కూడా విద్యార్థులకు పెట్టే ఆహారం నాణ్యత విషయం రాజీ పడొద్దని, వెంటనే అధికారులు తనిఖీలు ప్రారంభించాలని హుకుం జారీ చేశారు.
కఠిన చర్యలు తప్పవు
‘‘విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌషికాహారం అందించాలి. వారికి మంచి విద్యా అందించాలన్న ఉద్దేశంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేశాం. అదే విధంగా విద్యార్థులకు ఆహారం కూడా నాణ్యమైనది అందించాలని డైట్ ఛార్జీలు పెంచాం. ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కలెక్టర్ వేటు వేయాలి. వదంతులతో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఈ విషయంలో నిర్లక్ష్యం, అలసత్వం కనబరిచినట్లు రుజువైతే సదరు అధికారులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తరచూ తనిఖీలు చేయండి. విద్యార్థులకు పెట్టే ఆహారం తయారు చేస్తున్న పరిసరాలు, సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అదే విధంగా విద్యార్థులకు అందించే తాగు నీరు కూడా కలుషితం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలపై బుధవారం తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై స్పందించాలని ప్రభుత్వాన్ని కోరింది.
హైకోర్టు ఏమందంటే..
‘‘వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు మరణిస్తే కానీ తప్పించుకోరా? నారాయణపేట జడ్పీ స్కూల్ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీక. పిల్లలకు పెట్టే భోజనం నాణ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు. కోర్టు ఆదేశాలు జారీ చేస్తేనే పనులు చేస్తారా? నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు. అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు కదా. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఆహారం తినే పిల్లల విషయంలో ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు? అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహారించాలి’’ అని హైకోర్టు సీజే అలోక్ అరాధ సూచించారు.
ఇన్నాళ్లూ ఎందుకు స్పందించలేదు..
అయితే తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూడటంలో మాగనూరు ఘటన మొదటిది కాదు. చాలా కాలంగా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆసిఫాబాద్ వాంకిడిలోని గిరిజన ప్రభుత్వ వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ కావడం వల్ల శైలజ అనే విద్యార్థి కొన్ని రోజుల పాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. రెండు రోజుల క్రితం తుదిశ్వాస విడించింది. అప్పుడు స్పందించని సీఎం.. బుధవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలపై స్పందించడం కీలకంగా మారింది. హైకోర్టు స్పందించకుంటే.. విద్యార్థుల కష్టాలు సీఎంకు పట్టవా అని విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచామని డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వం.. విద్యార్థులకు పెడుతున్న ఆహార నాణ్యత విషయంలో ఎందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. పైగా హైకోర్టు స్పందిస్తే కానీ.. ఈ విషయాలు సీఎం దృష్టికి వెళ్లలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థులదే కీలక పాత్ర చెప్తున్న ప్రభుత్వం వారికి అందించే ఆహారంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని, ఇంత నాసిరకం ఆహారం అందిస్తున్నా అధికారులు కూడా తనిఖీలు చేయడం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.