
ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం డెడ్‌లైన్
వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేయించాలని సూచనలు.
ఉస్పానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. రెండు సంవత్సరాల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి నిర్మించాలని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా వసతులను కల్పించాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఆసుపత్రి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణంపై బుధవారం సీఎం రేవంత్ సమీక్షించారు. ఇందులో భాగంగానే అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పలు సూచనలు కూడా చేశారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోకసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.
ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు.. ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులకు సీఎం సూచించారు.
హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్మాణాలపై ఆ అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని సీఎం సూచించారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.